Wednesday, November 20, 2024

ఏపీ ప్రభుత్వం జల దోపిడీ.. కృష్ణా జలాల తరలింపుపై తుంగభద్ర బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఒప్పందాలను, నిబంధనలను తుంగలో తొక్కి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా నదీ జలాల దోపిడీకి పాల్పడుతోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ మురళీధర్‌ మంగళవారం తుంగభద్ర బోర్డుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతున్న సందర్భాలను లేఖలో వివరించారు. ట్రిబ్యునల్‌ తీర్పుకు విరుద్ధంగా కృష్ణా జలాలను కేసీ కెనాల్‌కు తరలించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఆ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని కోరారు. కేసీ కెనాల్‌ ఆయకట్టుకు సుంకేశుల ఆనకట్ట ద్వారా తుంగభద్ర జలాలను మాత్రమే వినియోగించాలన్న తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయాన్ని ఈ సందర్భంగా బోర్డుకు తెలియజేశారు. ఈ జలాలను తుంగభద్ర హైలెవెల్‌ కెనాల్‌కు తరలించి శ్రీశైలం ద్వారా కృష్ణా జలాలను కేసీ కెనాల్‌కు తరలించాలని ఏపీ సర్కారు భావిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇదే తరహాలో కేసీ కెనాల్‌కు కృష్ణా జలాల తరలింపు టైబ్యునల్‌ తీర్పుకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే రెండు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా తరలిస్తోందనీ, తాజాగా మరో రెండు టీఎంసీలు తరలించాలని ప్రయత్నిస్తోందని ఆక్షేపించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రయత్నాలను తక్షణమే నిలువారించాలని కేసీ కెనాల్‌కు కృష్ణా జలాల తరలింపును నిలిపివేయాలని తుంగభద్ర బోర్డు కార్యదర్శికి ఈఎన్‌సీ మురళీధర్‌ విజ్ఞప్తి చేశారు. తక్షణమే దీనిపై స్పందించి తగినవిధంగా కృష్ణా జలాల కేటాయింపులు జరపాల్సిందిగా కోరారు. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 17న హైదరాబాద్‌ జలసౌధలో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ- సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ పలు వాదనలు వినిపించారు.

స్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల వినియోగం లెక్కలు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం నదీ యాజమాన్య బోర్డును కోరింది. అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం ఎంత నీటిని వాడుకొన్నది.. ఎవరి వాటా ఎంత మిగిలి ఉందో తేలిపోతుందని పేర్కొంది. ఈ ఏడాది ఏపీ ఇప్పటికే వాటాకు మించి కృష్ణా జలాలను వాడుకుందన్న తెలంగాణ.. నీటి లెక్కల విషయంలో కఠినంగా ఉండాలని కోరింది. తెలంగాణకు ఇంకా 141 టీఎంసీల నీటి వినియోగానికి అవకాశం ఉందని ఆ మేరకు నీటిని వాడుకుంటామని ఈఎన్సీ మురళీధర్‌ పేర్కొన్నారు. మార్చి నెల మొదటివారంలో మరోమారు త్రిసభ్య కమిటీ- సమావేశమయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement