ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి అందివ్వనున్న కరోనా సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం మరికొంత మందికి విస్తరించింది. బోధనేతర సిబ్బంది క్యాటగిరీలో ఆయాలు, డ్రైవర్లకు కూడా రూ.2 వేల నగదు, 25 కిలోల సన్నబియ్యం అందించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇదివరకు టీచర్లు, క్లర్కులు, అకౌంటెంట్లు, లైబ్రరీ, ల్యాబ్ అసిస్టెంట్లు, అటెండర్లు, స్వీపర్లు మాత్రమే ఈ పథకానికి అర్హులని పేర్కొనగా.. తాజాగా ఆయాలు, డ్రైవర్లను కూడా ఆ జాబితాలో చేర్చారు.
యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో పేర్లు నమోదుకాని వారు కూడా సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు పాఠశాలలో పనిచేసినట్టు ఆధారాలు చూపించాలని అధికారులు తెలిపారు. ఈ పథకానికి తొలిరోజే 2,562 ఆన్లైన్ దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 15 వరకు దరఖాస్తులకు అవకాశమివ్వగా, భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ పథకం కింద వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు జిల్లాలవారీగా బృందాలను ఏర్పాటుచేస్తున్నారు.