Friday, November 22, 2024

కాకతీయ వారసుడికి తెలంగాణ ప్రభుత్వ ఆహ్వానం..

భారతదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యానికి, కాకతీయ పాలనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. శాతవాహనుల తరువాత తెలుగు మాట్లాడే వారందరిని రాజకీయంగా, సాంస్కృతికంగా ఐక్యం చేసి ఓరుగల్లు కేంద్రంగా మొదటి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించి దాదాపు 300 వందల ఏళ్లపాటు అప్రతిహతంగా పాలించిన ఘనత కాకతీయులది. అటువంటి మహోజ్వలమైన కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానుల వరుస దాడులతో చరిత్రలో 1323లో అస్తమించింది. ఇదంతా ఇప్పటి వరకు మనకు తెల్సిన చరిత్ర.. మనం పాఠ్య పుస్తకాల్లో చదువుకున్న చరిత్ర.. ఇది నాణానికి ఒకవైపు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ ప్రభుత్వం కాకతీయుల చరిత్రకు పెద్ద పీట వేస్తోంది. కాకతీయ సామ్రాజ్య ఓరుగల్లులో ఆస్తమించిన 700 సంవత్సరాల తర్వాత ఆ కాకతీయ ప్రస్తుత వారసుడిని సొంత గడ్డకు తీసుకురావడం కోసం సన్నాహాలు చేస్తున్నది. ఇదే నేపథ్యంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ చొరవతో, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిన్న వరంగల్ కేంద్రంగా కాకతీయ సప్తాహం పేరుతో 7 రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రస్తుత బస్తర్ మహారాజు, కాకతీయ వారసుడు మహారాజ కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయను ఆహ్వానించేందుకు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్, తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, టార్చ్ సంస్థ కార్యదర్శి అరవింద్ ఆర్య ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని జగదల్పూర్ చేరుకొని 22వ బస్తర్ పాలకుడు మహారాజా కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయని మర్యాద పూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారంగా ఆహ్వానించారు. వారి విజ్ఞప్తిని మన్నించి మహారాజు త్వరలో వరంగల్ రానున్నారు. ఈ సందర్భంగా మహారాజ కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయ మాట్లాడుతూ తన పూర్వీకుల పుట్టినిల్లు తనకూ పుట్టినిల్లే అని అటువంటి పుట్టినింటినీ 700 వందల సంవత్సరాల తర్వాత సందర్శించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కాకతీయ సప్తాహం పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం శుభ పరిణామమని తెలంగాణ ప్రభుత్వ చొరవను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారానే మన చారిత్రక వారసత్వాన్ని ఈ తరానికి పరిచయం చేయగలమని అభిప్రాయపడ్డారు. వరంగల్ నగరాన్ని చూడాలనే తన చిరకాల కోరిక త్వరలో తీరనుందన్నారు.

బస్తర్ కాకతీయుల చరిత్ర..

కాకతీయ సామ్రాజ్యంలో కొలువైన కోటలు, ఆలయాలు, కట్టడాలు దండయాత్రల్లో ఢిల్లీ సుల్తానుల విధ్వంసకర హస్తాల బారిన పడినా, వందల ఏళ్లయినా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని ఇప్పటికీ చెక్కుచెదరకుండా, అలనాటి చరిత్రను ఎలాగైతే మన కళ్ళముందు ఉంచుతున్నాయో, అపూర్వ కళావైభవాన్ని చాటుతున్నాయో కాకతీయ వారసత్వం కూడా అంతే దృడంగా, పటిష్టంగా ఉంది. ప్రతాపరుద్రుడి వీరత్వం, రుద్రమ్మ ధీరత్వం ఎక్కడికీ పోలేదు. 1323లో ప్రతాపరుద్రుడి మరణం తదుపరి ఏడాదే కాకతీయుల పరిపాలనా కౌశలం కొత్త చివుళ్లు పోసుకున్నది. ప్రతాపరుద్రుడి సోదరుడు అన్నమదేవుడు దంతెవాడ కేంద్రంగా 13వేల చ.కి.మీ విస్తీర్ణంలో మలి కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసాడు. ప్రతాపరుద్రుడి సోదరుడు అన్నమదేవుడితో మొదలైన కాకతీయ వారసులు ఇప్పటికి మనుగడలో ఉన్నారు. లక్షలాది మంది ఆదివాసులు ప్రస్తుత వారసుడైన మహారాజా కమల్ చంద్ర భంజ్ దేవ్ కాకతీయను తమ దేవుడుగా, ఆరాధ్య దైవంగా కొలుస్తున్న తీరు అబ్బురపరుస్తుంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement