Tuesday, November 26, 2024

తెలంగాణలో రోడ్డున పడ్డ 1,640 మంది వైద్య సిబ్బంది.. పలు చోట్ల ఆందోళనలు

కరోనా కష్టకాలంలో తమ ప్రాణాలను అడ్డుపెట్టి వేలాది మంది ప్రాణాలను కాపాడిన నర్సులను ఉద్యోగంలో నుంచి తీసివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం రాత్రి సర్కార్ ఉత్తర్వులు అందుకున్న వివిధ దవాఖాన్ల సూపరింటెండెంట్లు, మంగళవారం డ్యూటీలకు వచ్చిన నర్సులను వెనక్కి పంపించారు. డీఎంఈ ఆర్డర్‌‌‌‌‌‌ మేరకు ఉద్యోగాల నుంచి తీసేస్తున్నామని సమాచారం ఇచ్చారు. ఇన్నాళ్లు తమ సేవలను వాడుకుని, ఇలా రాత్రికి రాత్రే ఉద్యోగం తీసేస్తే తాము ఏమైపోవాలంటూ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. కోఠిలోని మెడికల్ ఎడ్యుకేషన్‌‌ ఆఫీసు వద్ద ఆందోళన చేపట్టారు. డీఎంఈ ఆఫీసుకు వందల సంఖ్యలో నర్సులు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. వందల మంది పోలీసులకు సేవ చేశామని, డైపర్లు మార్చామని తమను ఇలా అడ్డుకోవడమేంటని నర్సులు కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు నర్సులను ఈడ్చిపడేశారు.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి కాంట్రాక్ట్ నర్సులు ప్రయత్నించారు. తమను విధుల నుంచి తొలగించడంపై వారు ఆందోళన చేపట్టారు. కరోనా కష్టకాలంలో తమ సేవలు వాడుకుని ఇప్పుడు వద్దంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆందోళన చేపట్టిన నర్సులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

గత ఏడాది మార్చిలో కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా ప్రభుత్వం 1,640 మంది నర్సులను అవుట్‌‌సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్ చేసింది. కరోనా ఫస్ట్ వేవ్‌‌లో వేల మంది రోగులకు వీరు సేవలు అందించారు. ఈ ఏడాది మార్చి నాటికే వీరి ఉద్యోగ కాలపరిమితి పూర్తయినప్పటికీ, సెకండ్ వేవ్ ఎఫెక్ట్​తో వీళ్లను అలాగే కొనసాగించారు. సెకండ్‌‌ వేవ్‌‌లోనూ ప్రాణాలకు తెగించి పనిచేశారు. కరోనా తగ్గడంతో ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారు.

అయితే నర్సులు చేస్తున్న ఆరోపణలు సరికాదని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా.రమేష్ రెడ్డి తెలిపారు. ఒక ఏడాది లేదా రెగ్యులర్ నర్సులు వచ్చే వరకే ఈ ఉద్యోగాలు ఉంటాయని వాళ్ల రిక్రూట్‌‌మెంట్ ఆర్డర్‌‌‌‌లోనే స్పష్టంగా ఉందన్నారు. ఇప్పుడు రెగ్యులర్ నర్సుల రిక్రూట్‌‌మెంట్ పూర్తవడంతో, టెంపరరీ వాళ్లను తీసేస్తున్నామన్నారు. మొత్తం 1,640 మందిని తీసేయడం లేదని, రెగ్యులర్ నర్సులు ఎంత మంది వచ్చారో, అంతే మందిని తీసివేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వం పర్మిషన్ తీసుకొని మిగిలిన వాళ్లను కంటిన్యూ చేస్తామన్నారు. వాళ్లకు ఇష్టం ఉంటే ఉద్యోగాలు చేయొచ్చు, లేకుంటే వెళ్లిపోవచ్చని తెలిపారు. ఇందులో బలవంతమేమీ లేదని, తమ సూపరింటెండెంట్లు కూడా వాళ్లకు తెలియజేశారని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై లాఠీఛార్జి చేయడం దారుణం: బండి సంజయ్

Advertisement

తాజా వార్తలు

Advertisement