Tuesday, November 26, 2024

కరోనా లెక్కలను తగ్గించి చూపుతున్న తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం కరోనా లెక్కలను తగ్గించి చూపిస్తోందని ఓ జాతీయ మీడియా ఆధారాలతో బయటపెట్టింది. రోజువారీ మీడియా బులెటిన్‌లో ప్రభుత్వం చూపుతున్న కేసుల కంటే రెట్టింపు కేసులు నమోదవుతున్నాయని సదరు మీడియా ఆరోపించింది. జిల్లా స్థాయి అధికారులు చెప్పిన వివరాలకు, ప్రభుత్వం బులెటిన్‌లో చూపిస్తున్న కేసుల వివరాలకు అసలు పొంతన ఉండటం లేదని ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని 13 జిల్లాలకు సంబంధించి ఏప్రిల్ 17న నమోదైన కేసుల వివరాలను బహిర్గతం చేసింది. 66 శాతం రాష్ట్ర ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసులను తక్కువ చేసి చూపిస్తోందని సదరు నివేదిక ద్వారా ఆరోపించింది.

అంతేకాకుండా జిల్లా స్థాయిలో నమోదైన కేసులను రాష్ట్ర బులెటిన్‌లో ఇవ్వొదని ప్రభుత్వం ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సదరు మీడియా తెలిపింది. ఇంతకుముందు జిల్లా స్థాయి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తాజా కేసుల వివరాలను ప్రతిరోజు మీడియాకు వెల్లడించేవారు. అయితే గత రెండు రోజుల నుంచి ఈ వివరాలను అధికారులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్రతిరోజు కేసుల డేటా వివరాలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ల నుంచి ఆదేశాలు వెళ్లాయని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement