కరోనా నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని హైదరాబాద్‌కు చెందిన రెండు సంస్థలు చేసిన సర్వేల్లో తేలింది. మౌలిక వసతుల్లో తెలంగాణ, పంజాబ్, తమిళనాడు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయని తేలింది. ఈ సర్వేలను హైదరాబాద్‌కు చెందిన టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్, ఇండిపెండెంట్ పబ్లిక్ పాలసీ రీసెర్చర్ కలిసి నిర్వహించాయి.
అలాగే కరోనా నియంత్రణ సర్వేలో కూడా తెలంగాణ తొలి స్థానంలో నిలవగా రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో వైద్య సదుపాయాలు పెంచడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లను 15,203కు, ప్రైవేటులో 38,579కి పెంచారు. ప్రభుత్వ ఆస్పత్రులను 110కి, ప్రైవేటు ఆస్పత్రులను 1,157కు పెంచడంతో ఎక్కువ మందికి ట్రీట్‌మెంట్ అందుతోంది. వీటితో పాటు ఆక్సిజన్ బెడ్ల సంఖ్యను ప్రభుత్వ ఆస్పత్రుల్లో 4,773కి, ప్రైవేటు ఆస్పత్రుల్లో 13,425కు పెంచారు. అలాగే ఐసీయూ బెడ్ల సంఖ్యను, సాధారణ బెడ్ల సంఖ్యను, కొవిడ్ టెస్టులు చేసే ల్యాబ్‌లను ఇటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, అటు ప్రైవేటు ఆస్పత్రుల్లో విపరీతంగా పెంచారు. ఇవన్నీ తెలంగాణ తొలి స్థానంలో నిలవడానికి కారణమయ్యాయి.