రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ఉదయం నుంచే పరేడ్ గ్రౌండ్స్‌లో ఉత్సవాలు ప్రారంభమవ్వగా, సాయంత్రం ట్యాంక్ బండ్‌పై మరింత కోలాహలం నెలకొంది.
సచివాలయం, సెయిలింగ్ క్లబ్ వైపు నుంచి ట్యాంక్ బండ్‌పైకి చేరుకునే రెండు మార్గాలను రెండు భాగాలుగా విభజించి ఆయా ప్రాంతాల్లో తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, షాపింగ్, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. చిన్నారులతో వచ్చేవారి కోసం ప్రత్యేకంగా అమ్యూజ్‌మెంట్ జోన్, ఫొటో జోన్లను రూపొందించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్యాంక్‌బండ్‌కు చేరుకొని స్టాళ్లను సందర్శిస్తున్నారు. కాగా ఈ వేడుకల్లో సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తున్నారు. అనంతరం 70 నిమిషాల పాటు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఇందులో సుమారు 5 వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్‌బండ్‌పై భారీ ఫ్లాగ్‌వాక్ నిర్వహిస్తారు. ఆదివారం కావడంతో కుటుంబాలతో పెద్దఎత్తున ఉత్సవాలకు నగర ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లు సౌకర్యాలను కల్పించారు.