ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌ను జూన్ చివరి వారంలో జరిపేందుకు ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను నాలుగు నుంచి అయిదు రోజులపాటు , ఫార్మసీ, అగ్రికల్చర్ పరీక్షను మూడు రోజులపాటు నిర్వహించాలని ప్రతిపాదించింది. పరీక్షల తేదీల ఖరారుపై గురువారం ఉన్నత విద్యామండలిలో కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి మండలి ఛైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి, వైస్ ఛైర్మన్ ఆచార్య వేదుళ్ల వెంకటరమణ, జేఎన్‌టీయూ ఉప కులపతి , ఎంసెట్ ఛైర్మన్ కట్టా నర్సింహా రెడ్డి, కన్వీనర్ ఆచార్య గోవర్థన్‌లు పాల్గొంటున్నారు. జాతీయస్థాయిలో జరిగే జేఈఈ ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల కావటంతో ఎంసెట్ తేదీలను ఖరారు చేయాలని మండలి నిర్ణయించింది. ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్యను బట్టి ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాల సంఖ్యను , ఎన్నిరోజులు ఈ పరీక్షను జరపాలా..? అన్న అంశంపై నిర్ణయం తీసు కుంటామని నిర్వాహకులు చెబుతున్నారు. ఎంసెట్‌లో ర్యాంకుల నిర్ధారణకు ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇచ్చే అంశాన్ని కూడా గురువారం జరిగే సమావేశంలో నిర్ణయించనున్నారు.
గత ఏడాది కరోనా నేపథ్యంలో వెయిటేజీని రద్దు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న ఉత్కంఠ విద్యార్థుల్లో నెలకొంది. జేఎన్ టీయూ విశ్రాంత ఉపకులపతి దయారత్నం ఇచ్చిన కమిటీ నివేదిక ప్రకారం గత పద్నాలుగేళ్లుగా ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ఇస్తూ ర్యాంకులను కేటాయిస్తూ వస్తున్నారు. అకస్మాత్తుగా వెయిటేజీకి ప్రాధాన్యత ఇవ్వక పోతే ఎవరైనా న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈ అంశంపై ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయానికి రావాలని ఛైర్మన్ లింబాద్రి నిర్ణయించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..