తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడిగా మల్లన్నసాగర్ రిజర్వాయర్ భవిష్యత్ తరాలకు నాంది వేశారని టీ.ఆర్.ఎస్ లోక్ సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్న సాగర్ ను జాతికి అంకితం చేసిన సందర్భంగా ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. నది లేని చోట దేశంలోనే అతిపెద్ద జలాశయం సృష్టించిన అపరభగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని తెలిపారు. మానవ నిర్మిత మహాద్భుతం మల్లన్నసాగర్ రిజర్వాయర్ అని కొనియాడారు. తాగు నీరు, పారిశ్రామిక అవసరాలకు 50 టీఎంసీల నీరు ఉండేలా ప్రాజెక్టును ఎన్ని అడ్డంకులు ఉన్న వాటి అన్నింటినీ దాటి నాలుగేండ్ల లో సాకారం చేశారన్నారు. ఈ జలాశయంతో రాష్ట్రంలో ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నల్గొండ, నిజామాబాద్ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
మొత్తం 15,71,050 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయని ఎత్తిపోతల ప్రోజెక్టుల్లో దేశంలోనే మల్లన్న సాగర్ అతి పెద్ద రిజర్వాయర్ అన్నారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు మల్లన్న సాగర్ ఓ వరప్రదాయినని ఎంపీ నామ అన్నారు. అలానే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుండి పురుడుపోసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల ప్రాజెక్టు గా రికార్డు సొంతం చేసుకుందని ప్రపంచంలో అమెరికాలోని కొలరాడో, ఈజిప్టులోని గ్రేట్ మ్యాన్ మేడ్ రివర్ లో నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ లు మాత్రమే అతిపెద్దవి గా రికార్డులను సొంతం చేసుకోగా వాటిని తలదన్నేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఎంపీ నామ పేర్కొన్నారు. దీనితో తెలంగాణ రైతాంగానికి రెండు పంటలకు సాగునీటి భరోసా కలిగిందన్నారు. ఒక వైపు కాళేశ్వరం, మల్లన్నసాగర్ పనులను రికార్డు సమయంలో పూర్తి చేయడంతో పాటుగా గత ప్రభుత్వాలు అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులను సైతం తెలంగాణ ప్రభుత్వం పునప్రారంభంచి పూర్తి చేసిందని తెలిపారు. కాళేశ్వరం, నిర్దిష్ట సమయంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టుల పూర్తి తో వాటి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ స్థాయిలో పట్టుదల కనబర్చారో కండ్ల ముందు కనిపిస్తోందని అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఇళ్లల్లో పండుగ వాతావరణం నెలకొందని ఎంపీ నామ హర్షం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..