హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: కర్ణాటక తరహాలో ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు అత్యంత వేగంగా పావులు కదుపుతోంది. తెలంగాణ కాంగ్రెస్ హామీల డోస్‌ను మరింత పెంచేందుకు ఆ పార్టీ భారీ కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తుక్కుగూడ విజయగర్జన సభలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు తోడుగా మరిన్ని అస్త్రాలను ప్రయోగించాలన్న ఆలోచనతో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్టు చెబుతున్నారు.
త్వరలో ప్రకటించనున్న ఎన్నికల ప్రణాళిక(మ్యానిఫెస్టో)లో కొత్త హామీలను పొందుపరచాలని భావిస్తున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రణాళికను సిద్ధం చేసే బాధ్యతను మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలక నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పీసీసీ అప్పగించిన సంగతి తెలిసిందే. మ్యానిఫెస్టో రూపకల్పనపై గాంధీభవన్‌లో వరుస సమావేశాలను నిర్వహించిన శ్రీధర్ బాబు ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుస్తున్నారు. ఎన్నికల ప్రణాళికలో ఎటువంటి అంశాలను చేరిస్తే బాగుంటుందన్న అంశంపై ఆయన సమాలోచనలు జరుపుతున్నారు.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మకాం వేసి మహిళా, యువత, విద్యార్థి, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య వర్గాలు, ఆటో డ్రైవర్లు, అల్ప సంఖ్యాక వర్గాలు, కార్మికులు, కులవృత్తులు, వర్సిటీ విద్యార్థులు, కొందరు పార్టీ ముఖ్యులు, ఆర్థిక రంగ నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు విశ్రాంత అధికారులు, మాజీ ఉపకులపతులు, ఫ్యాప్సీ ఫిక్కీ రంగాలకు చెందిన ప్రముఖులతో సుదీర్ఘంగా సమావేశమై వారిచ్చిన సలహాలు, సూచనలను తీసుకుని అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం.
సోనియా గాంధీ తుక్కుగూడ వేదికగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని, గ్రామాలు, పట్టణ ప్రాంతాల మహిళలు, యువత వీటిపై చర్చించుకుంటున్నారని కొన్ని ప్రాంతాల్లో నేరుగా పార్టీ నేతలను కలుస్తూ ఆరు గ్యారెంటీలపై వారికున్న అనుమానాలను, సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారని చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు 6 గ్యారెంటీలకు ఫిక్స్ అయిపోయారని, విపక్ష పార్టీలు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ పార్టీ కీలక నేత ఒకరు చెప్పారు.
ఆరు పథకాలను ఎన్నికల నాటికి మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తే కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేస్తుందన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సమాచారం. ఆరు గ్యారెంటీలకు వారంటీ లేదని రాష్ట్ర మంత్రులు #హరీష్ రావు, కేటీ రామారావు అసంబద్ధమైన వాదన లేవనెత్తుతున్నా వారిని ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపించిన సర్వేల్లోనే బయటపడిందని, దీంతో ఏంచేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరికి గురవుతున్నారని ఆ నేత చెబుతున్నారు.
కాగా పెళ్లిడు కొచ్చిన అమ్మాయిలకు ప్రభుత్వం ఉచితంగా పది గ్రాముల బంగారం, పెళ్లికయ్యే కనీస ఖర్చులను భరించే పథకాన్ని మ్యానిఫెస్టోలో చేర్చేలా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన ఈ ప్రతిపాదనను పరిగణలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు.
తుక్కుగూడ సభతో కాంగ్రెస్‌లో నయా జోష్!
తెలంగాణ కాంగ్రెస్‌లో తుక్కుగూడ సభతో కొత్త జోష్ వచ్చింది. సభలో సోనియా, రా#హుల్ గాంధీలు ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతోందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో అధికారం తమదేనని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజల్లో ఊహించని మార్పు కనిపిస్తోందని, ఇది ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్లగలమన్న విషయంలో భారీ ప్రణాళిక అవసరమని భావిస్తున్నట్టు సమాచారం.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామన్న హామీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్న నిర్ణయం జరిగిందని చెబుతున్నారు. ఆరు గ్యారెంటీలపై బీజేపీ, బీఆర్ఎస్లు సైతం కాంగ్రెస్ సాధ్యం కాని హామీలు ఇస్తోందన్న ఆరోపణలు చేస్తున్నాయని, అయితే ప్రజలు తమ పక్షాన నిలబడి తలపడేందుకు సంసిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలంటున్నారు. తాము అధికారంలోకి రాగానే మొదటి క్యాబినెట్లోనే గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల్లో మహాలక్ష్మి ద్వారా మహిళలకు ప్రతినెలా రూ. 2,500 పంపిణీ, రూ.500కే వంట గ్యాస్ సిలిండర్.. ఆర్టీసీ బస్సుల్లో మ#హళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నారు. రైతు భరోసా ద్వారా ప్రతిఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15,000 బ్యాంక్ అకౌంట్లోకి, వ్యవసాయ కూలీలకు రూ.12,000 పంపిణీ.. వరిపంటకు రూ.500 బోనస్ ఇవ్వాలని ప్రకటించింది. గృహజ్యోతి స్కీమ్ ద్వారా ప్రతి కటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలని.. ఇల్లులేని వారికి ఇంటి స్థంలంతో కలిపి రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం.
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. యువ వికాసం స్కీమ్ ద్వారా విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు. చేయూత పథకం ద్వారా వృద్ధులకు, వికాలంగులకు, ఒంటరి మ#హళలకు, రూ. 4,000 నెలవారీ పింఛను. రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యభీమా అందించాలని కాంగ్రెస్ పార్టీ తన ఆరు అస్త్రాలుగా చెప్పుకుంటోంది.
అయితే వీటిని ఎక్కడి నుండి అమలు చేస్తారని భారాస నిలదీస్తోందని.. కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలు ఉదాహరణగా.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్స్‌లో 200 యూనిట్లలో ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్‌ని కర్ణాటక, రాజస్థాన్‌లో అమలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మహాలక్ష్మి ద్వారా రూ. 2,500, కర్ణాటకలో, వరికి క్వింటాల్‌కి రూ. 500 బోనస్ ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అందిస్తున్నాయి.
అక్కడ తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోపే అన్ని గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తున్నామని, తెలంగాణలో కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇక ఇప్పటికే ఇక్కడ రైతుబంధు కొనసాగుతోంది. దానిని మరో 5 వేలు పెంచాల్సి ఉంటుంది. తెలంగాణలో పెన్షన్ రూ. 3 వేలు ఇస్తున్నారు. దానిని మరో వెయ్యి రూపాయలు అదనంగా ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే ఇవి ఇష్టారీతిన ఇచ్చిన హామీలు కాదని, దీనిపైన ఆర్థిక నిపుణులు అధ్యయనం చేసిన తరువాతనే వీటిని ప్రకటించిందని తెలంగాణ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పడున్న పథకాలకు తోడు కాంగ్రెస్ తీసుకొచ్చే కొత్త పథకాలకు పెద్దగా బడ్జెట్ ప్రభావం ఉండదని.. ఇప్పటికే కాళేశ్వరం, పాలమూరు లాంటి ప్రాజెక్టులు పూర్తవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ప్రాజెక్టులు ఏమీ ఉండకపోవడం కలిసి వచ్చే అంశం.
రాష్ట్రంలో పెరుగుతున్న ఆదాయంతో కొత్త పథకాలకు ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. అయితే ఈ ఆరు గ్యారంటీ స్కీమ్స్‌ని జనాల దగ్గరకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ వ్యూ#హత్మకంగా డోర్ టూ డోర్ ప్రచారాన్ని చేస్తుండడం.. తాము అధికారంలో ఉన్నా రాష్ట్రాల్లో ఇప్పటికే అమలు చేస్తున్నామని జనాలను కాంగ్రెస్ మెప్పించే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ తమ అస్త్రాలుగా భావిస్తున్న ఆరు గ్యారంటీ స్కీమ్స్ ఎంతవరకు విజయతీరాలకు చేరుస్తాయో చూడాలి మరి.