Friday, November 22, 2024

కృష్ణా జలాలను జగన్‌కు కేసీఆర్ అమ్మేశారు: డీకే అరుణ

కృష్ణా జలాల వాటా విషయంలో ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్, జగన్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. కృష్ణా జలాలను ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు. కృష్ణా జలాలను నీవు తీసుకుపో… గోదావరి జలాలను నేను తీసుకుపోతా.. అనేలా ఇద్దరు సీఎంలు ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. తెలంగాణకు కేసీఆర్ పెద్ద ద్రోహం చేశారని… కృష్ణా నీటి పంపకాల్లో 299 టీఎంసీల నీటికి ఒప్పుకుని రావడమే ఆయన చేసిన తప్పని దుయ్యబట్టారు.

కృష్ణా జలాలపై కేసీఆర్‌ది దొంగ నాటకమేనని అరుణ అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో మరోసారి సెంటిమెంట్‌ను రగిల్చేందుకు కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. గట్టు మండలం రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమని… అక్కడ గట్టు లిఫ్ట్ కు ప్రతిపాదనలను సిద్ధం చేస్తే… వాటిని పక్కన పెట్టి డిజైన్లను మార్చారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో 90 శాతం పూర్తయిన ప్రాజెక్టుల నుంచి గంప మట్టి కూడా తీయలేదన్నారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో కేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకున్నారని డీకే అరుణ ఆరోపించారు.

ఇది కూడా చదవండి: కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదా

Advertisement

తాజా వార్తలు

Advertisement