కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం చోటుచేసుకుంది. బీడు భూముల్లోనూ గోదావరి జలాలు పరుగులు తీసేలా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. హల్దీ కాల్వలోకి 1600 క్యూసెక్కుల నీటిని ఆయన విడుదల చేశారు. 8 నుంచి 10 రోజుల్లో హల్దీ వాగు నుండి మంజీరా నదికి నీరు చేరుకుంటుంది. అక్కడి నుంచి మంజీరా ద్వారా నిజాం సాగర్‌లోకి గోదావరి జలాలు చేరనున్నాయి.
అనంతరం మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో కాళేశ్వర జలాలను గజ్వేల్ కాల్వలోకి విడుదల చేశారు. నీటి విడుదల సందర్భంగా గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.