Friday, November 22, 2024

గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్

హైదరాబాద్ నగరంలో గొల్కొండ కోటపై జాతీయ జెండా రెపరెపలాడింది. 75వ స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గోల్కోండకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, కళాకారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ.. తెలంగాణ ఏర్పడినప్పుడు ఉన్న విద్యుత్, తాగు నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కారించుకున్నట్లు తెలిపారు. ఏడేళ్ల వ్యవధిలో రాష్ట్రం అన్నిరంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించినట్లు చెప్పారు. 2013-14లో రూ. 1,12,126 ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.2,37,632కి పెరిగిందన్నారు. వ్యవసాయరంగంలో అభివృద్ధి తెలంగాణను రైస్ బోల్ ఆఫ్ ఇండియాగా మార్చిందని వివరించారు.

అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో ఉన్న సైనిక వీరుల స్మారకం వద్ద అమరులకు నివాళులర్పించారు. మరోవైపు సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్‌లో కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేసి మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. మరోవైపు గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి జాతీయజెండా ఎగురవేశారు. బీజేపీ కార్యాలయంలో పలువురు పార్టీ నేతల సమక్షంలో బండి సంజయ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. కాగా తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ఫలితమే నేటి స్వాతంత్ర్య వేడుకలు అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: వచ్చే 25 ఏళ్లలో భారత్ ప్రబల శక్తిగా ఎదగాలి: ప్రధాని మోదీ

Advertisement

తాజా వార్తలు

Advertisement