Friday, September 20, 2024

TG | రేపే తెలంగాణ కేబినెట్ భేటీ… కీలక అంశాలపై నిర్ణయం !

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో జరగనున్న ఈ సమావేశంలో వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా, హైడ్రాకు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్​ జారీకి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వివిధ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే పంట నష్టం సాయం, కొత్త ఆర్వోఆర్ చట్టానికి ఆమోదం, కొత్తగా 200 గ్రామ పంచాయతీల ఏర్పాటు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం.

ఇక‌ ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా భారీ న‌ష్టం వాటిల్లింది. దీనిపై కేంద్రం నుంచి ఉదారంగా సాయం చేయాలని క్యాబినెట్ తీర్మానం చేయనుంది. పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారీలో పారదర్శకత పెంచేందుకు ప్రస్తుత విద్యార్హతలను సవరించే ప్రతిపాదనపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కుల గణనను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఈ కుల గణన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు కుల గణనకు సంబంధించిన సర్వే మార్గదర్శకాలకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించనుంది.

అలాగే విద్య, వ్యవసాయ కమీషన్లకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. వీటితో పాటు ఆరోగ్య బీమా, రేషన్ కార్డులు, గ్రామపంచాయతీల్లో పేదలందరికీ ఆరోగ్య బీమా కల్పించే ప్రతిపాదనపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. సీఎంఆర్ఎఫ్ నిధుల భారీ వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement