తెలంగాణలో రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ భేటీ కానుంది. ప్రగతిభవన్‌లో జరుగనున్న ఈ సమావేశంలో లాక్‌డౌన్ విధింపుపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కరోనా అంతగా తగ్గటం లేదని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వర్గాలు లాక్ డౌన్ కావాలని కోరుకుంటున్నాయి. కరోనా విషయంలో తెలంగాణ హైకోర్టు సైతం ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలపై ఆసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధించటం వల్ల కలిగే సాధకబాధకాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై లాక్ డౌన్ ప్రభావం ఎంతమేరకు ఉంటుందనే అంశంపై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఈనెల 15 నుంచి సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తిగా అదుపులోకి రాని కరోనా కేసులకు అడ్డుకట్ట వేయాలంటే లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మరో నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో కూడా రోజుకు దాదాపు 5 వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరగనున్న కేబినెట్ మీటింగ్ లో కేసీఆర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదవుతుండటంతో ఇప్పటికే 14 రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని వణికిస్తున్న నేపథ్యంలో మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలంటూ భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ), ప్రతిపక్షాలు నుంచి డిమాండ్ వినిపిస్తోంది. లాక్ డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోలమవుతుందని, కూలీలు, కార్మికులు పనులు కోల్పోయి అల్లాడిపోతారని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, లాక్‌డౌన్ ప్రభావం ఎలా ఉంటున్నది? అది నిజంగానే కరోనా వ్యాప్తిని అరికడుతున్నదా? ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతుందా అన్న ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి.
దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించనప్పటికీ.. పలు రాష్ట్రాలోలో ఇప్పటికే పూర్తిస్థాయి లాక్‌డౌన్, పాక్షిక లాక్‌డౌన్ విధించాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, కేరళ, మిజోరాం, రాజస్థాన్, మణిపూర్ తదితర రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నాయి. మహారాష్ట్రలో ఏప్రిల్ 22న లాక్‌డౌన్ తరహాలో కఠినమైన ఆంక్షలను ప్రకటించగా.. అనంతరం వాటిని ఈ నెల 15 వరకు పొడిగించారు. మహారాష్ట్రలో లాక్ డౌన్ వల్ల మంచి ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ ముందు 60 వేలపై చిలుకు కేసులు నమోదు కాగా… ప్రస్తుతం దాని సంఖ్య 30 వేలకు తగ్గింది. ఢిల్లీలో గత నెల 19 నుంచి లాక్‌డౌన్ అమల్లో ఉన్నది. దానికి ముందు రోజు 24,852 కేసులు నమోదుకాగా.. సోమవారం ఢిల్లీలో 12,651 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలో కేసులు తగ్గినప్పటికీ మరణాలు పెరిగాయి.
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. తక్షణం పూర్తిస్థాయి ప్రణాళికతో, ముందస్తు ప్రకటనతో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను విధించటం ఒక్కటే మార్గం అని వైద్య నిపుణులు అంటున్నారు. రాత్రి కర్ఫ్యూ వంటి ఆంక్షల వల్ల ఫలితం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది.