Monday, November 18, 2024

TG | 21న తెలంగాణ కేబినెట్‌ భేటీ!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : ఎన్నికల కోడ్‌ ముగిసిన అనంతరం తెలంగాణ మంత్రిమండలి భారీ అజెండాతో సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం మేరకు ఈ నెల 21న ఉదయం 11 గంటలకు సచివాలయం వేదికగా కేబినెట్‌ భేటీ జరగనుంది.

పరిపలనకు సంబంధించిన అనేక అంశాలు, సంక్షేమ రంగానికి చెందిన కీలక నిర్ణయాలు, ఉద్యోగులు, ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు తదితర అంశాలు అజెండాలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అత్యంత ప్రాధాన్యత గల, రాజకీయ సవాళ్ళతో ముడిపెట్టుకుని ఉన్న అంశం రైతు రుణమాఫీ, నిధుల సమీకరణపై సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

లబ్ధిదారుల ఎంపిక విషయంలో అనుసరించాల్సిన విధానాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఇదివరకున్న మార్గదర్శకాలు తదితర అంశాలపై సీఎం రేవంత్‌ తమ మంత్రివర్గ సహచరుల అభిప్రాయం తీసుకోనున్నారు. అలాగే పదేళ్ల గడువు ముగిసిన నేపథ్యంలో విభజన సమస్యల పరిష్కారం దిశగా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.

చట్టంలోని 9వ, 10వ షెడ్యూల్‌ సంస్థల విభజన అడ్డంకులకు పరిష్కార మార్గం చూపనున్నారు. విద్యుత్‌ ఒప్పందాలు, కాళేశ్వరం అక్రమాలపై చర్చించనున్నారు. ఈ రెండు అంశాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్‌ కమిషన్ల విచారణ, ఇప్పటికే ఇచ్చిన ప్రాథమిక నివేదిక అంశాలపై కూడా చర్చ జరగనుంది.

ప్రభుత్వోద్యోగుల పీఆర్‌సీ, డీఏ, ఇతర సమస్యలపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. తాజాగా సీఎం ప్రకటించిన నూతన విద్యా విధానంపై కేబినెట్‌ చర్చించనుంది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలపై ఎన్డీఎస్‌ఏ మధ్యంతర నివేదికపై చర్చించి, మరమ్మతులు, తదుపరి కార్యాచరణలపై నిర్ణయం తీసుకోనున్నట్లుగా సమాచారం.

- Advertisement -

రుణమాఫీ నిధుల సమీకరణ ప్రధానం..

రుణమాఫీకి అవసరమైన నిధుల సమీకరణ, లబ్ధిదారుల ఎంపిక విధానం, రుణమాఫీకి సంబంధించి కటాఫ్‌ తేదీ నిర్ణయం, మహారాష్ట్ర పర్యటనలో అధ్యయనం చేసిన అంశాలపై విశ్లేషణ తదితర అంశాలపై కేబినెట్‌ అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా పర్యటనల అజెండాపై కూడా మంత్రిమండలిలో చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.

రైతు రుణమాఫీపై కూడా మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇటీవల ఎన్నికల సందర్భంలో ప్రజలకు హామీ ఇచ్చినందున, ఆగస్టు 15వ తేదీ నాటికి రుణమాఫీ చేసి తీరాల్సిందేనని సీఎం, మంత్రులు పదేపదే చెబుతున్న నేపథ్యంలో దానికోసం నిధుల సమీకరణ, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది.

సుమారు 42 లక్షల మంది రైతులకు రుణమాఫీకి సుమారు రూ.32,000 కోట్ల నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న అంశంతో పాటు దానికి సంబంధించి విధి, విధానాలపై అధికారులకు మంత్రివర్గం దిశానిర్దేశం చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. రాష్ట్ర ఆదాయం పెంచుకునేందుకు వనరుల సమీకరణ, ప్రత్యామ్నాయ, నూతన మార్గాల అన్వేషణపై కేబినెట్‌ చర్చించనుంది.

రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలపై కీలక నిర్ణయం..

రాష్ట్ర పునర్విభజన జరిగి పదేళ్లు పూర్తి అవుతున్న తరుణంలో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినేట్‌లో చర్చించనున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే వివిధ శాఖలు అధికారులు పలు అంశాలపై ని వేదికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా నేడు జరిగే కేబినేట్‌లో ఎపి, తెలంగాణ విభజన వివాదాలపై మంత్రివర్గం చర్చించనుంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం పెంపు మార్గాలపై సమావేశంలో చర్చించనుంది.

పునర్విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10లోని వందకుపైగా ఆస్తుల విభజన, హైదరాబాద్‌లో ఎపికి కేటాయించిన భవనాల స్వాధీనం, బకాయిల వివాదాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన వివరాలతో నివేదిక తయారు చేస్తున్న ఆర్థిక శాఖ కేబినెట్‌ ముందు పెట్టనుంది. ఎపితో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు చేసి కొన్ని అంశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.

ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై..

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ, రైతులకు చెల్లింపులు, ఖరీఫ్‌ పంటల సాగు, పెట్టుబడి నిధుల అంశంపై కూడా కేబినెట్‌ సమీక్షించనున్నట్టుగా తెలుస్తోంది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యం కొనుగోలు, ప్రాసెసింగ్‌, నష్టం తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. రానున్న ఖరీఫ్‌ పంటల ప్రణాళికపై కూడా కేబినెట్‌లో చర్చ జరుగనున్నట్టుగా తెలిసింది. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు అవగాహన కార్యక్రమాలపై చర్చించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement