Telangana Cabinet Meet: ఈరోజు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ పథకానికి సంబంధించిన విధివిధానాలపై చర్చించి మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రైతుబంధు పథకం స్థానంలో కొత్తగా రైతు భరోసా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు తోసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పిన హామీ అమలుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇప్పటికే రైతు రుణమాఫీ పై కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్.. ఎన్నికల సమయంలో చెప్పినట్టుగా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అధికారులు ఇందుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించారు. మొతం మూడు లేదా నాలుగు విడతల్లో రుణమాఫీ చేసేలా అధికారులు విధివిధానాలు చేసినట్లు సమాచారం.
జులై 15 నుంచి రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఆగస్టు 15 వరకు కొనసాగనుంది. ముందుగా రూ.50వేలు ఉన్నవారికి, రెండవ విడత రూ.75 వేలు ఉన్నవారికి, మూడో విడత రూ.1 లక్ష ఉన్నవారికి, నాలుగో విడత రూ.2 లక్షల ఉన్నవారికి చేయాలనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి..