అంచనా బడ్జెట్..
అంచనా వ్యయం రూ.2,75,891 కోట్లు..
రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు
మూలధన వ్యయం రూ.29,669 కోట్లు
కేటాయింపులు ఇలా..
ఆరు గ్యారెంటీల అమలు రూ.53,196 కోట్లు
ఐటీ శాఖ రూ.774 కోట్లు
పంచాయతీరాజ్ శాఖ రూ.40080 కోట్లు
పురపాలక శాఖ రూ.11,692 కోట్లు
వ్యవసాయ శాఖ రూ.19,746 కోట్లు
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాలు రూ.1250 కోట్లు
గృహ నిర్మాణం రూ.7740 కోట్లు
నీటి పారుదల శాఖ రూ.28024 కోట్లు
బీసీ సంక్షేమం రూ. 8,000 కోట్లు.
విద్యారంగానికి రూ. 21,389 కోట్లు
వైద్యారోగ్య రంగానికి రూ. 11,500 కోట్లు
గృహజ్యోతి పథకానికి రూ. 2,418 కోట్లు
ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ. 16,825 కోట్లు
తెలంగాణ బడ్జెట్ ను డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం అంచనా వ్యయం రూ.2,75,891 కోట్లు..ఇక రెవిన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు గా చూపారు… మూలధన వ్యయం రూ.29,669 కోట్లు ఉన్నట్లు బడ్జెట్ లో పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత… తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజల కోసం ఎన్ని కష్టాలనైనా ఓర్చుకోవడానికి సిద్ధమని ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అమరవీరులు దేనికోసమైతే త్యాగాలు చేశారో వాటిని సాధిస్తామని పేర్కొన్నారు. ఇనుప కంచెలు బద్దలుకొట్టి ప్రారంభమైన ప్రజాపాలన నిరాటంకంగా కొనసాగుతుందని భట్టి చెప్పారు.
ధనిక రాష్ట్రంలోనూ ప్రజలు కష్టాలతో సతమతం కావడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కొందరి కోసం అందరు అన్నట్లుగా గతంలో పాలన కొనసాగిందని బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. మార్పు కోరుతూ స్వేచ్ఛను సాధించుకున్నారంటూ రాష్ట్ర ప్రజలకు భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మాత్రం అందరి కోసం మనమందరం అనే నూతన స్ఫూర్తితో పనిచేస్తోందన్నారు. ఆరు గ్యారంటీల అమలుకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు సంక్షేమం-అభివృద్ధే ధ్యేయంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే ఆరు గ్యారంటీలను ప్రకటించామని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దుర్భరంగా మార్చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన నష్టాలకు సంబంధించి తమ ప్రభుత్వం మొదట్లోనే శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలను ప్రజల ముందు పెట్టిందని భట్టి గుర్తుచేశారు. ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి ఇవేవీ తమకు అడ్డుకాదని, ఎంత కష్టపడడానికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. ఆరు గ్యారంటీలను అమలు చేసి తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వాస్తవదూరంగా ఉందని బీఆర్ఎస్ పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. దళిత బంధు పథకానికి బడ్జెట్ లో రూ.17,700 కోట్లు కేటాయించిన గత ప్రభుత్వం.. వాస్తవంలో ఒక్క పైసా కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.
నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నాం..
నాసిరకం విత్తనాలను, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని భట్టి విక్రమార్క తెలిపారు. రైతుకు నష్టం చేసే ఏ విత్తన వ్యాపారినీ కూడా తమ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు.. నాణ్యమైన విత్తన ఉత్పత్తి విషయాల్లో పురోభివృద్ధి సాధించేందుకు సకల చర్యలు తీసుకుంటున్నాం. ఈ మేరకు త్వరలో ఒక నూతన విత్తన విధానం తీసుకురాబోతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.