హైదరాబాద్, ప్రభన్యూస్: మంచినీటి చేపల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డు లభించింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నిన్న భువనేశ్వర్‌లో ఎన్‌ఎఫ్‌డిబి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారాజేంద్ర, మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరాంభూక్యా అందుకున్నారు. మంచినీటి చేపల ఉత్పత్తికి కృషి చేసి ఉత్తమ అవార్డు అందుకున్న అధికారులను శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మత్స్యశాఖ అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని, అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లో చేపపిల్లలను వదులుతున్నామని, సహజ నీటి వనరుల్లో పెరుగుతున్న తెలంగాణ చేపలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందన్నారు. మత్స్యరంగ అభివృద్ధికి సహకరించి, ప్రోత్సహిస్తున్న సీఎంకు తలసాని కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా శాఖ అభివృద్ధికి కృషి చేస్తున్న అధికారులను అభినందించారు.
గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital