హైదరాబాద్, ఆంధ్రప్రభ: సమైక్యాంధ్ర పాలనలో వంచనకు గురైన జీవనదుల ఆధారిత ప్రాజెక్టులు తెలంగాణలో జలసిరులతో జతకట్టి బీడుభూముల్లో సిరులు పండిస్తూ ప్రవహిస్తున్నాయి. కోటి 25 లక్షల ఎకరాలకు మించి సాగుచేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అనేక ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతుండాగా కొత్తప్రాజెక్టుల పనుల్లో వేగం పుంజుకుంది. బీడు భూములు, గల్ఫ్ వలసలే ఆధారంగా జీవిస్తున్న అనేక ప్రాంతాలకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో రూపొందించిన బసవేశ్వర ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టు సర్వే పనులు పూర్తిచేసుకుని భూసేకరణ సమస్యలను అధిగమించి నిర్మాణం వైపు అడుగులు పడుతున్నాయి.
కరువు పీడిత సంగారెడ్డి జిల్లాలో ఎగువనున్న నారాయణఖేడ్, ఆందోల్ నియోజక వర్గాలోని 8మండలాల్లోని 166 గ్రామాలకు సాగు, తాగునీరు అందిచే లక్ష్యంతో నిర్మిస్తున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. మరో రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనే లక్ష్యంతో సాగునీటి పారుల శాఖ కృషి చేస్తుంది. సింగూరు రిజర్వాయర్ నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ఈప్రాజెక్టు నిర్మాణానాన్ని ప్రభత్వం తలపెట్టింది. రూ.1,774 కోట్ల వ్యవయం తో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు సర్వే పనులు పూర్తిఅయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షా 65 వేల ఎకరాలకు సాగునీరు అందేవిధంగా పంటకాలువల సర్వేలను ప్రభుత్వం పూర్తి చేసింది.
ఈ ప్రాజెక్టుకు రెండు పంపుహౌసుల నిర్మాణంతో పాటుగా సబ్ స్టేషన్ల నిర్మాణానికి మాస్టర్ ప్లాన్‌ను నీటిపారుదల శాఖ పూర్తి చేసింది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ఎత్తు 59.75 మీటర్లు కాగా విద్యుత్ వినియోగం 70 మెగావాట్లు కానుంది. 88.20 కిలోమీటర్ల కెనాల్‌ను నిర్మించేందుకు ఇరిగేషన్ శాఖ ప్లాన్ రూపొందించి భూసేకరణలో నిమగ్నమైంది. బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి 166.10 కిలోమీటర్ల కెనాల్స్ నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ఇందు రెండు బ్రాంచ్ కెనాల్స్ రానున్నాయి. గుత్తి బ్రాంచ్ కనాల్, కసర్ గుత్తి బ్రాంచ్ కెనాల్ నిర్మించనున్నారు. బ్రాంచ్ కెనాల్స్‌కు అనుసంధానంగా 20 కిలోమీటర్ల పట్‌పల్లి కెనాల్, 20కి.మీ. నారాయణఖేడ్ కెనాల్, 12.90 కిలోమీటర్ల రేగోడ్ కెనాల్, 16.80 కి.మీ కంగి కెనాల్, 16.40 కి.మీ. అంతర్ గావ్ కెనాల్ నిర్మాణ పనులకోసం రాష్ట్ర ప్రభుత్వం భూసర్వే పూర్తి చేసింది.
బసవేశ్వర ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుతో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లోని 130 గ్రామాల్లోని లక్షా 31వేల ఎకరాలకు సాగునీరు, ఆందోళ్ నియోజక వర్గంలోని రెండుమండలాల్లో 36 గ్రామాల్లోని 34వేల భూములకు నీరు అందనుంది. రెండేళ్లలో పూర్తి కానున్న బసవేశ్వర ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుతో లక్షా 65వేల ఎకరాలు సస్యశ్యామలం అయ్యే అవకాశాలుండటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడంతో పాటుగా కొత్తప్రాజెక్టుల నిర్మాణాలవైపు ప్రభుత్వం దృష్టి సారించడంతో రాష్ట్రంలో కోటి 25 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందే అవకాశాలున్నాయని ప్రభుత్వం అంచెనావేస్తోంది.