Tuesday, November 26, 2024

టూరిజంలో టాప్-3 స్టేట్‌గా తెలంగాణ.. హాల్ ఆఫ్ ఫేమ్‌గా ఆంధ్రప్రదేశ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పర్యాటక పురస్కారాల్లో ఉత్తమ పర్యాటక రాష్ట్రం (పర్యాటకంలో సమగ్రాభివృద్ధి) విభాగంలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానం దక్కించుకుంది. ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో ‘హాల్ ఆఫ్ ఫేమ్‌’గా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా జాతీయ పర్యాటక అవార్డుల (2018-19) ప్రదానం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులను ఆయా రాష్ట్రాలు, సంస్థలకు ప్రదానం చేశారు. ఇందులో ‘బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌’గా సికింద్రాబాద్ అవార్డు దక్కించుకుంది. హైదరాబాద్‌లోని అపోలో హెల్త్ సిటీకి ‘బెస్ట్

మెడికల్ టూరిజం ఫెసిలిటీ’ అవార్డు దక్కగా, హైదరాబాద్ గోల్ఫ్ కోర్సుకు ఉత్తమ పర్యాటక గోల్ఫ్ కోర్స్ అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రచురించిన ‘సీసైడ్’ (కాఫీ టేబుల్ బుక్)కు ‘ఎక్సలెన్స్ ఇన్ పబ్లిషింగ్ ఇన్ ఇంగ్లిష్; అవార్డుతో పాటు విదేశీ భాషల్లోనూ ‘సీసైడ్’ పుస్తకానికి (రష్యన్, స్పానిష్ జర్మన్)కు అవార్డు లభించింది. అలాగే బెస్ట్ 5స్టార్ హోటల్‌గా విజయవాడలోని ‘ది గేట్‌వే హోటల్’ అవార్డు దక్కించుకుంది. 2019-20 సంవత్సరానికి గాను ఈ అవార్డులకు ఎంపిక చేయగా, ఆ తర్వాత వరుసగా రెండేళ్ల పాటు కరోనా కారణంగా పర్యాటక రంగం పూర్తిగా కుదేలైన విషయం తెలిసిందే. దాంతో అప్పటి అవార్డులను మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో కేంద్రం అందజేసింది.

ఉత్తమ పర్యాటక రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ మొదటిస్థానంలో నిలవగా, రెండో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. మూడో ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఎంపికవగా.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్కడ్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డితోపాటు పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, కార్యదర్శి అర్వింద్ సింగ్, అడిషనల్ సెక్రటరీ రాకేశ్ వర్మ, వివిధ రాష్ట్రాల పర్యాటక మంత్రులు, పర్యాటక శాఖ అధికారులు, ఆతిథ్య రంగ ప్రతినిధులు, షెఫ్ లు తదితరులు పాల్గొన్నారు.

దేశీయ పర్యాటకానికి చక్కటి భవిష్యత్తు: ఉపరాష్ట్రపతి
భారతదేశ పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని కావాల్సిందల్లా పర్యాటక కేంద్రాలకు అవసరమైన రవాణా, ఇతర మౌలికవసతుల కల్పన చేపట్టడమేనని భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్ కర్ పేర్కొన్నారు. అవార్డుల కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈశాన్యరాష్ట్రాలు మొదలుకుని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతిచోటా భారతదేశంలో పర్యాటకానికి విస్తృత అవకాశాలున్నాయన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ ప్రాంతాల్లో జరిగే పండగలు, పురాతన కట్టడాలు ఇలా ప్రతిచోటా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలున్నాయన్నారు.

- Advertisement -

విదేశాలతో పోలిస్తే మన వద్ద తక్కువేముందని ఆయన ప్రశ్నించారు. మన ఆలోచన విధానాన్ని మార్చుకుంటే మరిన్ని అద్భుతాలు సాధించవచ్చని ఉపరాష్ట్రపతి అన్నారు. భారతపర్యాటక రంగం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అభినందించారు. పర్యాటక రంగం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవడంతోపాటు, ఉపాధి కల్పనకు బాటలు పడతాయన్న ఉపరాష్ట్రపతి అన్నారు.

పర్యాటకాన్ని పునరుద్ధరిద్దాం.. కలసిరండి: కిషన్ రెడ్డి
అంతకుముందు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశీయ పర్యాటకాభివృద్ధికి కోసం కేంద్ర ప్రభుత్వం చిత్తుశుద్ధితో కృషిచేస్తోందన్నారు. కరోనానంతర పరిస్థితుల్లో దేశీయ పర్యాటకానికి కొత్త ఊపిరిలూదేందుకు వివిధ మంత్రిత్వ శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. పర్యాటకులకు అవసరమైన రవాణా (రోడ్డు,రైలు, వాయు, జల) వసతులను మెరుగుపరచడంతోపాటు ఆయా పర్యాటక ప్రాంతాల్లో అవసరమైన మౌలికవసతుల కల్పనకోసం కృషిచేస్తున్నామన్నారు.

‘న్యూ ఇండియా విజన్’ నినాదంతో త్వరలోనే నూతన జాతీయ పర్యాటక విధానాన్ని తీసుకొస్తున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు. ఇందులో భాగంగా మౌలిక వసతుల కల్పన, పర్యాటక పరిశ్రమను వృద్ధిచేయడం, పర్యాటానికి అనుబంధంగా ఉన్న రంగాలను ప్రోత్సహించడం, పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం వంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం భాగస్వామ్యపక్షాలను కలుపుకుని ముందుకు వెళ్తున్నామన్నారు.

భారతదేశంలో ఉన్న 3600 పురాతత్వ ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ ఆయా ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ వంటి పథకాల ద్వారా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనానంతర పరిస్థితుల్లో పర్యాటక కేంద్రాల వద్దనున్న చిరు వ్యాపారులకు, ఇతర భాగస్వామ్య పక్షాలకు లక్ష రూపాయల గ్యారంటీ లేని రుణాలు అందిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో రామాయణ సర్క్యూట్, కృష్ణ సర్క్యూట్, బుద్ధా సర్క్యూట్, అంబేద్కర్ సర్క్యూట్ తదితర సర్క్యూట్ ల ద్వారా పర్యాటక, ఆతిథ్య రంగానికి ప్రోత్సహించే కార్యక్రమాలు వేగవంతం అయ్యాయన్నారు.

తెలంగాణతో కేంద్రం పోటీపడాలి: శ్రీనివాస్ గౌడ్
దేశ స్థూల జాతీయోత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందని, అన్ని రంగాల్లో తెలంగాణలో ముందంజలో ఉందని ఆ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. విజ్ఞాన్ భవన్‌లో అవార్డులు అందుకున్న తర్వాత ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళవారం ప్రకటించిన పర్యాటక అవార్డుల్లోనే కాదు, అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రకటించిన అనేక అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని గుర్తుచేశారు.

సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన అవార్డులు ప్రకటిస్తే.. 20 అవార్డుల్లో 19 తెలంగాణకు వచ్చాయని అన్నారు. స్వచ్ఛభారత్ అవార్డుల్లో తెలంగాణ 13 అవార్డులు దక్కించుకుందని గుర్తుచేశారు. తెలంగాణ అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పనులను ప్రధాని మోడీ గుర్తించాలని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇంటింటికి నీరు అందుతోందని, ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణాయే అని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యేక సాయం అందడం లేదని ఆరోపించారు.

మంచిగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించాల్సింది పోయి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ పురోగతి చెందుతుంది కాబట్టే కేంద్రం ప్రకటించే అవార్డుల్లో దూసుకెళ్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే అభివృద్ధి విషయంలో తెలంగాణతో పోటీపడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే భారత్ నెంబర్ వన్ అవుతుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement