హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసెంబ్లి, సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా దక్షిణాదిలో సత్తా చాటేందుకు బీజేపీ సిద్దమవుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దక్షిణాదిలో 170 ఎంపీ సీట్లను గెలుచుకోవాలని భావిస్తున్న బీజేపీ అందుకు తెలంగాణ రాష్ట్రం ముఖ ద్వారంగా అనేక వ్యూహాత్మక నిర్ణయాలను అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈక్రమంలోనే తెలంగాణ నుంచి ప్రధాని మోడీని లోక్‌సభ బరిలోకి దింపాలని బీజేపీ అధిష్టానం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణలోని మెదక్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోడీ తెలంగాణ నుంచి లోక్‌సభకు పోటీ చేయనున్నారన్న ప్రచారానికి ప్రాధాన్యత నెలకొంది.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోడీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలన్న కృతనిశ్చయంతో తెలంగాణ బీజేపీ పెద్దలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని మోడీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని నిర్ణయిస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా కాలంగా బీజేపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు బండారు దత్తాత్రేయ కూడా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన విషయం తెలిసిందే.
కర్ణాటక అసెంబ్లి ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ప్రధాని మోడీ పోటీ చేసి గెలుపొందడం ద్వారా పార్టీ శ్రేణులతోపాటు ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్‌ను ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల బీజేపీ అధ్యక్ష, కార్యదర్శుల సమావేశంలోనూ ప్రధాని మోడీని దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక లేదా తమిళనాడు ఈ రెండు రాష్ట్రాల్లో కుదరకపోతే తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలో దింపాలన్న అభిప్రాయం నేతల నుంచి బలంగా వ్యక్తమైంది.
ప్రధాని మోడీని దక్షిణాది నుంచి పోటీకి దించితే కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లోక్‌సభ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థులకు పొలిటికల్ మైలేజ్ వస్తుందని ముఖ్యనేతలు చెబుతున్నారు. సికింద్రాబాద్ నుంచి కాకపోతే తమిళనాడులోని రామనాథపురం లేదా కర్ణాటకలోని బెంగళూరు సౌత్ నుంచి ప్రధాని మోడీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.