తెలంగాణలో పరిశ్రమల స్థాపనే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఈరోజు జపాన్లోని యమునాషిలో పర్యటించారు. ఈ సందర్భంగా యమునాషి గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు.
అక్కడ అత్యాధునిక గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రత్యేకంగా పరిశీలించారు. అంనతరం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్రక్రియలు, బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థలు, ఇతర పునరుత్పాదక ఇంధన సాంకేతికతలపై కేంద్రం శాస్త్రవేత్తలు, అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా తెలంగాణ మారనుందని హర్షం వ్యక్తం చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ టెక్నాలజీని నెలకొల్పేందుకు జపాన్ కి చెందిన యమునాషి కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ హరిత భవిష్యత్తు దిశగా అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్రంలో పుష్కలంగా నీటి వనరులు ఉన్నాయని, సోలార్ ప్లాంట్లకు అణువైన కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.