Wednesday, November 20, 2024

TG | క్రీడ‌ల‌కు కేంద్ర బిందువుగా తెలంగాణ : సీఎం రేవంత్

హైద‌రాబాద్ : దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తెలంగాణ ఉండాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం స‌చివాల‌యంలో ఉన్న‌తాధికారుల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీపై ఆయ‌న వారితో చ‌ర్చించారు.

ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయ‌నున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ఏవిధంగా ఉండాల‌నే దానిపై ప‌లు సూచ‌న‌లు చేశారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో ప్ర‌తి క్రీడ‌కు ప్రాధాన్యం ఉండాల‌ని, అన్ని ర‌కాల క్రీడల‌ను, క్రీడా శిక్ష‌ణ సంస్థ‌ల‌ను ఒకే గొడుగు కింద‌కు తేవ‌డ‌మే స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ల‌క్ష్య‌మ‌న్నారు.

మ‌న దేశంతో పాటు తెలంగాణ‌లోని భౌగోళిక ప‌రిస్థితులు, మ‌న శారీర నిర్మాణ తీరుకు అనువైన క్రీడ‌లు ఏవో గుర్తించి, క్రీడ‌ల‌పై ఉత్సాహం ఉన్న వారిని గుర్తించి వారిని ఆయా క్రీడ‌ల్లో ప్రోత్స‌హించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ద‌శాబ్దాల క్రిత‌మే ఆఫ్రో-ఏషియ‌న్ గేమ్స్‌, కామ‌న్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్య‌మిచ్చిన‌ హైద‌రాబాద్‌ను భ‌విష్య‌త్తులో ఒలింపిక్స్‌కు వేదిక‌గా మార్చాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

హైద‌రాబాద్‌లో ఒలింపిక్స్ నిర్వ‌హించ‌డ‌మే కాకుండా ప్ర‌తి క్రీడ‌లో మ‌న క్రీడాకారులు ప‌త‌కాలు ద‌క్కేలా వారిని తీర్చిదిద్దాల‌ని, అందులో మ‌న స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ క్రీడాకారులు క‌చ్చితంగా ఉండాల్సిదేన‌ని ముఖ్య‌మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం వారికి నిపుణులైన శిక్ష‌కుల‌తో శిక్ష‌ణ ఇప్పించాల‌న్నారు.

అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో…

రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల్లోని క్రీడా విభాగాలు, ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలోని క్రీడా పాఠ‌శాల‌లు, అకాడ‌మీలు, క్రీడా శిక్ష‌ణ సంస్థ‌లు అన్నింటిని స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి తీసుకురావాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో మ‌న దేశ క్రీడాకారులు ఒలింపిక్స్‌లో రాణించే షూటింగ్‌, రెజ్లింగ్‌, బాక్సింగ్‌, అర్చ‌రీ, జావెలిన్ త్రో, హాకీకి ప్ర‌థ‌మ ప్రాధాన్యం ఇవ్వాల‌ని, ఆ త‌ర్వాత శిక్ష‌ణ ద్వారా ప‌త‌కాలు సాధించే అవ‌కాశాలు ఉన్న క్రీడ‌ల్లో శిక్ష‌ణ ఇప్పించాల‌ని సూచించారు. యూనివ‌ర్సిటీలో ఆయా క్రీడ‌ల్లో శిక్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన వ‌స‌తులు, ఆహారంతో అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్దాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

- Advertisement -

ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో క్రీడా పాఠ‌శాల‌…

చిన్న‌త‌నంలోనే విద్యార్థుల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలు, వారికి ఏ క్రీడ‌ల‌పై మ‌క్కువ ఉందో ఉపాధ్యాయ‌లు గుర్తించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. అటువంటి విద్యార్థులంద‌రికీ ఆయా క్రీడ‌ల్లో శిక్ష‌ణ ఇచ్చేలా ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఒక స్పోర్ట్స్ స్కూల్‌ ఏర్పాటు చేయాల‌న్నారు. ఆ పాఠ‌శాల‌ల్లో విద్యా బోధ‌న‌తో ఉంటుంద‌ని అయితే క్రీడ‌ల‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంద‌ని, విద్యార్థుల‌కు అక్క‌డ‌ వారికి న‌చ్చిన క్రీడ‌ల్లో శిక్ష‌ణ ఇచ్చి, ప్ర‌తిభ ఆధారంగా వారికి స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీలో వ‌స‌తి క‌ల్పించి మ‌రింత ప‌దును తేలేలా శిక్ష‌ణ ఇప్పించాల‌న్నారు..

స‌మ‌గ్ర అధ్య‌య‌నం..

హైద‌రాబాద్‌లోని స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ దేశా క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా ఉండాల‌ని, అందుకోసం అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ఇటీవ‌ల ఒలింపిక్స్‌లో ప‌త‌కాలు సాధించిన దేశాలు, క్రీడాకారుల వివ‌రాల‌ను సేక‌రించి, ఆయా క్రీడాకారులు ప‌త‌కాల సాధ‌న‌కు శ్ర‌మించిన తీరు, ఆయా దేశాలు వారిని ప్రోత్స‌హించిన తీరు, వారికి ఇచ్చిన శిక్ష‌ణ‌, ప్రోత్సాహం త‌దిత‌రాల‌పై అధ్య‌య‌నం చేసి స‌మ‌గ్ర నివేదిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌కు సూచించారు.

ఇప్ప‌టికే స్కిల్ యూనివ‌ర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టామ‌ని, స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ యంగ్ ఇండియా పేరు ఖ‌రారు చేశామ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు యంగ్ ఇండియా పేరు పెడ‌తామ‌ని ముఖ్యమంత్రి వెల్ల‌డించారు. తెలంగాణ యంగ్ ఇండియాకు బ్రాండ్‌గా మారాల‌ని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు. క్రీడా నైపుణ్యాల్లో తెలంగాణ ఒక శ‌క్తిమంత‌మైన రాష్ట్రంగా గుర్తింపు పొంద‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ఏర్పాట్లు చేయాల‌ని ముఖ్య‌మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement