Monday, November 25, 2024

షా’కింగ్’ స్ట్రాట‌జీ – కారుకు బ్రేకులెలా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి: తెలంగాణ పాలిటిక్స్‌లో మునుగోడు బైపోల్‌ తర్వాత స్పష్టమైన మార్పులు రాగా, కమల వ్యూహాలకు బీజేపీ దిగ్గజ నేత అమిత్‌షా పదునుపెట్టారు. బీజేపీకి సంబంధించి సంస్థాగత అవరోధాలు, నేతల పనితీరు, ప్రజాభిప్రాయాన్ని అనుకూలంగా మార్చు కోవడానికి చేపట్టాల్సిన చర్యలపై పలు నివేదికలు తెప్పించుకున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నేడు ఢిల్లిలో టీబీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. సంస్థాగత వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న సునీల్‌ బన్సల్‌ పార్టీనేతలతో సంబంధం లేకుండా.. ఒంటరిగా పలువురిని కలుసుకుంటూ గ్రహించిన సమాచారం ఢిల్లిdకి పంపగా, కేంద్ర పార్టీకి కూడా పలు సర్వే నివేదికలు అందాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కార్నర్‌ మీటింగ్‌లు జరుగుతుండగా, కొందరు నేతలు వీటిని సీరియస్‌గా తీసుకోవడం లేదు. కొద్దిరోజులుగా స్తబ్దుగా ఉన్న రాజకీయాలు.. మార్చిలో హీటెక్కుతాయన్న అంచనాలున్నాయి. తెలంగాణలో నేతల మధ్య ఐక్యతాలోపం, గ్రూపు రాజకీయాలపై అధిష్టానం అసంతృప్తిగా ఉంది. బీఆర్‌ఎస్‌ ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న వ్యూహాత్మక రాజకీయాలను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై కేంద్ర పార్టీ సూచనలు రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదు. ఈ క్రమంలో అమిత్‌ షా నుండి పిలుపు రావడం, అమిత్‌ షా కార్యాలయంలోనే కీలక సమావేశం జరగనుండడం ఆసక్తి రేపుతోంది.

లిక్కర్‌ స్కాం కేసులో తెలంగాణలో తదుపరి అరెస్ట్‌లు ఉంటాయన్న ప్రచారాన్ని బీజేప నేతలు చేస్తున్నారు. అయితే అరెస్ట్‌ పరిణామాలపై కాకుండా తాజా నివేదికలు, మార్చిలో పార్టీ పరంగా చేయనున్న సంస్థాగత మార్పులపైనే ప్రధానంగా చర్చిస్తారు. ఓ వైపు లిక్కర్‌ స్కాం, మరోవైపు సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎర వ్యవహారంలో స్పందించిన తీరు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయనుంది. ఈ క్రమంలో కేంద్ర బీజేపీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తుందా? తెలంగాణ పాలిటిక్స్‌పై ఎంత సీరియస్‌గా ఉందన్న అంశాలపై రానున్న రోజుల్లో స్పష్టత రానుంది. మంగళవారం జరిగే కీలక భేటీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎలక్షన్‌ కమిటీ సభ్యుడు ఎంపీ లక్ష్మణ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌ వంటి నేతలు హాజరుకానున్నారు.

ప్రజల విశ్వాసం గెలవాలి
ప్రజల విశ్వాసం గెలిచేలా నేతలు వ్యవహరించాలని బీజేపీ కేంద్ర నాయకత్వం పదేపదే సూచిస్తోంది. బీఆర్‌ఎస్‌ అసెంబ్లి నియోజకవర్గాలు టార్గెట్‌గా పక్కా వ్యూహంతో ముందుకు వెళుతుండగా, బీజేపీలో అలాంటి లక్ష్యిత వాతావరణం లేదన్న అంశాన్ని షా టీమ్‌ గుర్తించింది. ఇటీవల ఢిల్లికి చెందిన రెండు కేంద్ర నాయకత్వ సన్నిహిత సర్వే సంస్థలు రాష్ట్రంలో తిరిగి వెళ్ళాయి. ఈ నివేదికలపై కూడా షా సమీక్ష చేయనున్నారు. ఎప్పటికపుడు నేతల పనితీరును సమీక్షిస్తూ.. అందుతున్న నివేదికలు, పనితీరుపై షా సీరియస్‌గా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ దూకుడు పెంచి, నియోజక వర్గాలపై స్పష్టతనిచ్చే కార్యాచరణ మొదలుపెట్టాలని కేంద్ర నాయకత్వం భావిస్తోంది.
……..

Advertisement

తాజా వార్తలు

Advertisement