తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఛైర్మన్, సభ్యులను సీఎం కేసీఆర్ నియమించారు. ఛైర్మన్‌గా ఐఏఎస్ అధికారి బి.జనార్దన్ రెడ్డి నియామకమయ్యారు. మొత్తం 8 మందితో కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కమిషన్‌లో ఎక్కువగా రిటైర్డ్ అధికారులు, ప్రస్తుత అధికారులకు అవకాశం ఇచ్చారు. ఆరవెల్లి చంద్రశేఖర్, రమావత్ ధన్‌సింగ్, బి. లింగారెడ్డి, కోట్ల అరుణ కుమారి, ఆర్ సత్యనారాయణ, సుమిత్ర ఆనంద్, కారం రవీందర్ రెడ్డి సభ్యులుగా నియామకమయ్యారు.
టీఎస్‌పీఎస్సీ నూతన కమిషన్ ఏర్పడటంతో త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నాలుగు వారాల్లో తెలంగాణ పబ్లిక్ కమిషన్‌ను నియమించాలని, లేదంటే ఆఫీసును మూసేసుకోవాలంటూ తెలంగాణ హైకోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో కమిషన్‌ను నియమించేందుకు కేసీఆర్ సర్కారు తుది నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలోనే గవర్నర్ తుది ఉత్తర్వులు ఇవ్వనున్నారు.