హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులకు వచ్చే పేద, సామాన్య గర్భిణులకు అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ముందుకు వెళుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రసూతి ఆసుపత్రులన్నింటిలో టీఫా స్కానింగ్ యంత్రాలను సమకూర్చాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60కి పైగా ప్రసూతి ఆసుపత్రులు ఉండగా… వాటిల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే టీఫా స్కానింగ్ సదుపాయం ఉన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. గర్భంలో ఉన్న బిడ్డ వివిధ అవయవాల ఎదుగులతోపాటు జన్యుపరమైన లోపాలు, తల, వెన్నుముక తదితర కీలక అవయవాల ఎదుగుదలను ప్రస్తుతం అందుబాటులో ఉన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు చూపెట్టలేవు.
దీంతో ఇదే అదనుగా ప్రయివేటు ప్రసూతి ఆసుపత్రులు, ప్రయివేటు గైనిక్‌లు టీఫా స్కానింగ్ పరీక్షకు రాస్తూ పేద, సామాన్య రోగులను దోచుకుంటున్న తీరు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ప్రతి నెలా టెస్టులకు వెళ్లే గర్భిణీకి కనీసం రెండు సార్లైనా టీఫా స్కాన్ టెస్టును ప్రయివేటు గైనిక్‌లు రిఫర్ చేస్తున్నారు. ఒకసారి టీఫా స్కానింగ్ చేస్తే కనీసం రూ.3వేల దాకా ఖర్చు అవుతోంది. టీఫా స్కానింగ్‌కు రూ.5వేలదాకా వసూలు చేసే స్కానింగ్ సెంటర్లు రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. అదే సమయంలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లోని వైద్యులు కూడా కమిషన్లకు కక్కుర్తిపడి అవసరం లేకున్నా టీఫా స్కానింగ్ టెస్టులు రాస్తున్నారు. దీంతో ప్రయివేటులో వేలకు వేలు వెచ్చించి టీఫా స్కానింగ్ తీయుంచుకోలేక పేద, సామాన్య గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చి, పేద, సామాన్య గర్భిణీలకు ప్రభుత్వ ప్రసూతి వైద్యాలయాల్లోనే టీఫా స్కానింగ్ సదుపాయాలు ఉన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లను సమకూర్చాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు నిర్ణయిం చారు. రాష్ట్రంలోని 54 ప్రభుత్వ ప్రసూతి వైద్యాలయాల్లోటీఫా స్కానింగ్ సదుపాయం ఉన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లను యుద్ధ ప్రాతిపదికన సమకూర్చాలని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అక్టోబరు నెలాఖరుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులకు టీఫా స్కానింగ్ , అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను కూడా టీఎస్‌ఎంఐడీసీ ప్రారంభించినట్లు తెలిసింది.