తెలంగాణ పోలీసులు తనపై వరుసగా కేసులు నమోదు చేస్తుండటంపై తీన్మార్ మల్లన్న హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. తనపై కేసుల నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నెల 3న తనకు నోటీసులు ఇచ్చారని, రెండు రోజుల సమయంలోనే విచారణకు పిలిచారని వాపోయారు. దర్యాప్తు పేరుతో వేధించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో తీన్మార్ మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై సీసీఎస్, చిలకలగూడ పీఎస్‌లో కేసులు నమోదయ్యాయని పిటిషన్లో తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. తనను పోలీస్ స్టేషన్లకు పిలవకుండా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఆన్లైన్లో విచారణ జరిపేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. తీన్మార్ మల్లన్న పిటిషన్ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది. కాగా తీన్మార్ మల్లన్న తన ప్రైవసీకి భంగం కలిగించాడంటూ మహిళా జర్నలిస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యూ న్యూస్ మాజీ బ్యూరో చీఫ్ ప్రవీణ్‌తో కలసి ఉన్న ఫొటోలను చూపుతూ అభ్యంతరకరంగా వార్తలు ప్రసారం చేశారని.. తన గౌరవ మర్యాదలకు భంగం కలిగించారంటూ ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదైంది.
ఈ వార్త కూడా చదవండి: కేరళ హైకోర్టు సంచలన తీర్పు.. భార్యకు ఇష్టం లేకుండా సెక్స్ చేస్తే విడాకులే