దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలో ఒకటైన ఎన్‌ఎస్‌ఈలో సాంకేతిక సమస్య తలెత్తింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే.. కొన్ని స్టాక్ ధరలు తెరపై అప్‌డేట్ కాలేదని పలు బ్రోకరేజీ సంస్థలు ఎక్స్ఛేంజీ దృష్టికి తీసుకొచ్చాయి. నిఫ్టీ సహా మరికొన్ని ఇండెక్స్‌ల ధరలు సైతం తెరపైకి కనిపించలేదని పేర్కొన్నాయి. ఏడాది క్రితం ఫిబ్రవరి 24న కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. దీంతో ఏకంగా ఎక్స్ఛేంజీని 4 గంటల పాటు మూసివేయాల్సి వచ్చింది. తాజా సమస్యతో మరోసారి ఎన్‌ఎస్‌ఈ వినియోగిస్తున్న సాంకేతికత, ఆటోమేషన్‌పై అనుమానాలు రేకుత్తుతున్నాయి. సమస్యను వెంటనే పరిష్కరించినట్టు ఎన్‌ఎస్‌ఈ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. నిఫ్టీ, నిఫ్టీ బ్యాంకులో అప్పుడప్పుడు ధరలు తెరపై అప్‌డేట్ కాలేదని తెలిపింది.
పరిష్కరించిన తరువాత.. అన్ని సూచీలు సాధారణంగానే పని చేస్తున్నాయని వెల్లడించింది. ధరలు మాత్రమే అప్‌డేట్ కాలేదని, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అయ్యాయని బ్రోకరేజీ సంస్థలు తెలిపాయి. ఎన్‌ఎస్‌ఈ సర్వర్ సాంకేతికతపై పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సి ఉందని పలువురు బ్రోకర్లు డిమాండ్ చేశారు. కో లొకేషన్ ప్రాగ్జిమిటీ సర్వర్లు కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాయా..? లేదా కేవలం నాన్ కో-లొకేషన్ ట్రేడర్లు మాత్రమే ఇబ్బంది పడ్డారా.. విచారించాలని బ్రోకరేజీ సంస్థలు కోరుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..