హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టించి, ఎకరాకు లక్షకుపైగా పెట్టుబడి పెట్టి పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యాపారస్తులు కుమ్మక్కై పసుపు ధరను ఒకేసారి క్వింటాలుకు రూ.5వేల నుంచి రూ.5500 వరకు తగ్గించి కొంటున్నారు. దీంతో పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాలను ఎలా పోషించాలో తెలియక రైతులు కన్నీరుపెట్టుకుంటున్నారు. అసలే ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా వేరుకుళ్లు, దుంపకుళ్లు రోగాలు ఆశించడంతో సాగు చేసిన 80శాతం పసుపు పంట తీవ్రంగా దెబ్బతిన్నది. ఏ రోగం సోకని పసుపు పంట కేవలం 20శాతం మాత్రమే. తీరా ఆ పసుపు దిగుబడిని మార్కెట్‌కు తీసుకెళ్తే రైతులకు రూ.5వేలకు, మహా అయితే రూ.6వేలకు మించి క్వింటా పసుపు ధర పలకడం లేదు.
ధర వచ్చినపుడు అమ్ముకుందామని నిల్వ ఉంచిన పాత పసుపుకు, తాజాగా సాగుక్షేత్రం నుంచి సేకరించి తెచ్చిన కొత్త పసుపుకూ వ్యాపారులు ఒకే రేటు చెల్లిస్తున్నారు. పంట దిగుబడినిఅమ్మి అప్పులు తీర్చి, కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థికంగా దన్నుగా నిలుద్దామని కోటి ఆశలతో మార్కెట్‌కు పసుపు పంటను తెచ్చిన రైతులకు నిరాశే మిగులుతోంది. గతేడాది చివరగా చెల్లించిన క్వింటాకు రూ.4100 నుంచి రూ.6వేల ధరనే వ్యాపారులు చెల్లిస్తున్నారు. గతేడాది పసుపు దిగుబడి బాగా వచ్చినపుడు క్వింటా రూ. 4500 నుంచి రూ.9వేల దాకా ధర పలికింది.
ఈ సీజన్‌లో 20 రోజులుగా మార్కెట్‌కు పెద్ద ఎత్తున పసుపు పంట వస్తున్నా ధర మాత్రం రూ.5500 మించడం లేదు. రాష్ట్రంలో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, వరంగల్, కరీంనగర్ తదితర జిల్లాల్లో పసుపు సాగవుతోంది. ఒక్క నిజామాబాద్ జిల్లానే దాదాపు లక్షకు పైగా ఎకరాల్లో పసుపు సాగవుతోంది. దాదాపు 13ఏళ్ల క్రితం క్వింటా పసుపుకు రూ.15వేల దాకా ధర పలికింది. అది లగాయిత్తు ఇప్పటి వరకు పసుపు పంటకు ఆశించినస్థాయిలో గిట్టుబాటు ధర రావడం లేదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఎకరా పసుపు సాగుకు 1, 25, 000 నుంచి రూ.1, 50, 000 వరకు పెట్టుబడి అవుతోంది. పెట్టుబడి పెరగడానికి తోడు ఈ ఏడాది దుంపకుళ్లు కారణంగా దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది.
ఈ ప్రతికూల పరిస్థితుల్లో పచ్చ బంగారంగా పేర్కొనే పసుపు సాగుకు నిజామాబాద్‌రైతులు గుడ్‌బై చెప్పేందుకు రెడీ అవుతున్నారు. పసుపు సాగుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే పసుపు సాగు గణనీయంగా తగ్గిపోయింది. మద్ధతు ధర లేకపోవడం, వ్యాపారులు చెల్లించే ధర గిట్టుబాటు కాకపోవడం, పసుపు బోర్డు ఏర్పాటు కాకపోవడం, పెట్టుబడులు ఏటేటా పెరగడం వంటి కారణాలతో రైతులు పసుపు సాగును తగ్గిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో తెగుళ్లు, రోగాల కారణంగా పసుపు దిగుబడి తగ్గినందున కనీసం క్వింటా పసుపుకు రూ.10వేలు చెల్లించాలని కోరుతున్నారు.