టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీతో భారత్ కి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్మానించేందుకు బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీమిండియా ఆటగాళ్లు వాంఖడే మైదానానికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది. ఆటగాళ్లు జాతీయ జెండాలు చేతబూని స్టేడియమంతా కలియతిరిగారు. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేసి అభిమానుల్లో జోష్ నింపారు.
అనంతరం వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రపంచకప్ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ట్రోఫీ గెలుపులో కీలకపాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, పేసర్ బుమ్రా అభినందనలు తెలిపారు. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా రూ.125 కోట్ల ప్రైజ్ మనీ చెక్కును టీమిండియా క్రికెటర్లకు అందించారు. వాంఖడే స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించారు. దీంతో స్టేడియంలోని స్టాండ్స్ అన్నీ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయాయి.