ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి మ్యాచ్‌లోనే చుక్కెదురైంది. గ్రూప్-ఎలో భాగంగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 58 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. రన్‌రేట్ కూడా (-2.900) భారీగా పడిపోవడంతో హర్మన్‌సేన తమ గ్రూప్‌లో చివరి స్థానంలో నిలిచింది.
ఇక ఇక్కడి నుంచి సెమీస్ చేరాలంటే టీమిండియా మిగిలిన ప్రతి మ్యాచ్‌లోనూ తప్పక గెలవాల్సిందే. ఈ క్రమంలోనే భారత్ రేపు తమ రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఈ మ్యాచ్ హర్మన్ సేనకు చావోరేవోగా మారింది. ఇందులో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి.
అందుకే తొలి మ్యాచ్‌లో జరిగిన తప్పిదాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. టీ20ల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై టీమిండియాకు ఘనమైన రికార్డు ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 15 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు జరిగాయి. అందులో టీమిండియా ఏకంగా 12 విజయాలు సాధించగా.. పాక్ మాత్రం 3 మాత్రమే గెలిచింది.
ఇక టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మధ్య మొత్తం 7 మ్యాచ్‌లు జరగగా.. అందులో టీమిండియా 5 సార్లు, పాక్ 2 సార్లు గెలిచింది. ఈ రికార్డులను చూస్తే పాక్‌ను ఓడించడం టీమిండియాకు చాలా తేలికే అనిపిస్తోంది. కానీ, గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న పాక్.. ఈ ప్రపంచకప్‌లోనూ శుభారంభం చేసింది. తమ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.
బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలర్ల అద్భుత ప్రదర్శనతో పాక్ జట్టు స్వల్ప లక్ష్యాన్ని సైతం కాపాడుకో గలిగింది. ఇప్పుడు భారత్‌తో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. మరోవైపు కివీస్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో పూర్తిగా విఫలమైన హర్మన్ సేన ఇప్పుడు కీలకమైన పాక్ పోరుకు మంచి హోమ్ వర్క్ చేసింది. గెలుపు కోసం మంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు రెడీ అయింది. ఇక ఈ టోర్నీ హైవోల్టేజ్ మ్యాచ్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.
ఇరు జట్ల స్క్వాడ్‌లు:
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, యాస్తికా భాటియా, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, హేమలత, ఆశా శోభన, రాధా యాధవ్, శ్రేయంక పాటిల్, సజీవన్ సంజనా.
పాకిస్తాన్: ఫాతిమా సనా (కెప్టెన్), మునిబా అలీ, గుల్ ఫిరోజా, సిద్ర అమీన్, నిదా దార్, ఆలియా రియాజ్, తుబా హసన్, సదఫ్ షమాస్, నష్రా సంధు, డయానా బేగ్, ఇరమ్ జావేద్, ఒమైమా సోహైల్, సయ్యదా ఆరుబా షా, తస్మియా రుబాయ్.