టీమిండియా సొంతగడ్డపై పులి వంటిదే. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే విదేశాల్లో భారత్ ఎప్పుడూ తడబడుతూనే ఉంటుంది. విదేశాల్లో పిచ్‌లపై మనవాళ్లు చేతులెత్తేస్తుంటారు. అయితే ఇటీవల టీమిండియా పంథా మారినట్లే కనపడుతోంది. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో టెస్టు సిరీస్‌లను గెలిచిన భారత ఆటగాళ్లు తాజాగా ఇంగ్లండ్ గడ్డపైనా దూసుకుపోతున్నారు. ఐదో టెస్టులో గెలిస్తే ఇంగ్లండ్ గడ్డపై భారత్ నాలుగో సారి సిరీస్ విజయం సాధిస్తుంది.
గతంలో ఇంగ్లండ్ గడ్డపై భారత్ 1971, 1986, 2007 సంవత్సరాల్లో సిరీస్‌లు గెలిచింది. ఇప్పుడు గెలిస్తే నాలుగోది అవుతుంది. అంతేకాకుండా క్రికెట్ మక్కా లార్డ్స్, అలాగే 125 సంవత్సరాల పురాతన ఓవల్ మైదానంలో ఒకే సిరీస్‌లో భారత్ విజయం సాధించటం ఇదే తొలిసారి. మరో ప్రత్యేకత ఏమిటంటే ఓవల్‌లో టెస్ట్ మ్యాచ్ గెలవటం గత 50 ఏళ్లలో ఇదే తొలిసారి. 1971 సిరీస్‌లో మొదటిసారి ఓవల్‌లో గెలవటంతో పాటు సిరీస్ కూడా కైవసం చేసుకుంది.
మరోవైపు ఓవల్ టెస్టు విజయంతో కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ టెస్ట్ రికార్డు మరింత బెటర్ అయింది. అతడు మొత్తం 65 టెస్టులకు సారథ్యం వహించి 38 మ్యాచ్‌లలో గెలిపించాడు. 16 మ్యాచ్‌లలో భారత్ ఓడిపోయింది. 11 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇంగ్లండ్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిపించిన కెప్టెన్‌గా కోహ్లీ ఘనత సాధించాడు.