Monday, November 25, 2024

ఇంకా జీతం పడలే.. 14 జిల్లాల టీచర్ల ఎదురుచూపు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పేరుకు ధనిక రాష్ట్రం..దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెనక్కి నెట్టి వృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇంత వరకూ ఏప్రిల్‌ నెల జీతాలు అందనేలేదు. 33 జిల్లాల్లో సుమారు 14 జిల్లాలకు వారి వారి ఖాతాల్లో జీతాలు జమ కాలేదని సమాచారం. ధనిక రాష్ట్రంలో జీతాల కోసం ఎదరుచూసుడేందని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. ఈనెల 9వ తేదీ వచ్చినా ఇంకా ఇంత వరకు జీతాలు అందకపోవడంతో ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

సోమవారం సాయంత్రం వరకు దాదాపు 19 జిల్లాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు జీతాలు అందినట్లు సమాచారం. మిగతా జిల్లాల టీచర్లకు ఎప్పుడు అందుతాయో తెలియక వారు ఆందోళన చెందుతున్నారు. సోమవారం నాడు వికారాబాద్‌, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, మెదక్‌, సిద్ధిపేట, నిర్మల్‌ జిల్లాల్లోని వారికి బ్యాంకు ఖాతాల్లో జమైనట్లు తెలిసింది. ఆదివారం నాటికి 12 జిల్లాల వాళ్లకు జీతాలు అందాయి. ఒకేసారి కాకుండా విడతలవారీగా కొన్ని కొన్ని జిల్లాలకు వేతనాలను విడుదల చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈనెల 8 వరకు కేవలం 19 జిల్లాలకు మాత్రమే జీతాలు జమయ్యాయి.

- Advertisement -

గతంలో ఒకటో తేదీన జీతాలు జమయ్యేవి. గత రెండేళ్లుగా నెల మొదటి పనిదినం నుండి 14 తేదీ మధ్య రొటేషన్‌ పద్ధతిలో విడతల వారీగా జీతాలు జమ చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెబుతున్నారు. ఒక్కోసారి ఇలా 12, 14వ తేదీ వరకూ జీతాలు ఆలస్యంగా జమవుతుండటంతో కుటుంబ అవసరాలు, వైద్య ఖర్చులకు చేతిలో సరిపడా డబ్బుల్లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకు ఖాతాల్లో జీతం ఎప్పుడు జమవుతుందోనని ఆయోమయం నెలకొందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నడూలేనంతగా స్వరాష్ట్రంలో జీతాలు ఇలా ఆలస్యంగా విడుదల చేస్తుండటంపై ఉపాధ్యాయ వర్గం మండిపడుతోంది.

ఫస్ట్‌ నాడే ఎందుకివ్వరు?…

ఫస్ట్‌ తారీఖు నాడే జీతాలు ఎందుకివ్వరని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. సమయానికి జీతాలు అందకా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవతున్నామని ఆవేదన చెందుతున్నారు. ఇంటి నిర్మాణం కోసమో, పిల్లల చదువుల కోసమో, గృహ , ఇతరరత్ర అవసరాల కోసం బ్యాంకులు, ఫైనాన్స్‌ కంపెనీల నుంచి తీసుకున్న రుణాలకు ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. తీసుకున్న రుణాలకు ఈఎంఐలు ప్రతి నెల 1 నుంచి 5వ తేదీలోపు కట్టాల్సి ఉండడంతో జీతాలు ఆ తేదీల్లో తమ ఖాతాల్లో జమకాకపోవడంతో చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయని, సెబిల్‌ స్కోర్‌ తగ్గుతుందని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి కటకం రమేష్‌ పేర్కొన్నారు. నాన్‌ ప్లానింగ్‌ పోస్టులకు బడ్జెట్‌ ఉంటుందని, కానీ ప్రభుత్వం జీతాలను సమయానికి అందించకుండా తాత్సారం చేస్తోందని ఆయన ఆరోపించారు. పన్నుల రాబడిలో, వృద్ధిలో ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వద్ద సరిపడా ఖజానా లేకపోవడంతోనే ఈ విధంగా జీతాల్లో ఆలస్యమవుతోందని ఆయన ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement