Friday, November 22, 2024

పండగ‌కు జీతం అందేనా?… దసరా ముందే జీతాలు వేయాలని టీచర్ల విజ్ఞప్తి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పేరుకే తెలంగాణ ధనిక రాష్ట్రం. కానీ వాస్తవ పరిస్థితుల్లో మాత్రం టీచర్లకు ఒకటో తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. గత కొంత కాలంగా ఒకటో తారీఖు జీతాలు పడడం ఆగిపోయింది. దీంతో అక్టోబర్‌ 1వ తేదీకైనా పండక్కు ముందు జీతాలు వేస్తారో లేదో…తాము బతుకమ్మ, దసరా పండుగలను కుటుంబ సభ్యులతో ఎలా జరుపుకోవాలని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలలుగా ఉపాధ్యాయులకు జీతాలు సమయానికి అందటంలేదు. కొన్ని జిల్లాలకు మొదటి వారంలో వస్తే, మరికొన్ని జిల్లాలకు రెండో వారం 14వ తేదీ వరకు జీతాలు అందుతున్నాయని టీచర్‌ సంఘాల నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండుగకు ఉద్యోగ, ఉపాధ్యాయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంతా జరుపుకోవాలంటే సెప్టెంబర్‌ నెల జీతాన్ని అక్టోబర్‌ 1వ తేదీన అందేవిధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రతి కుంటుంబం నూతన వస్త్రాలతోపాటు మిగతా ఖర్చులు ఉన్న నేపథ్యంలో దసరా పండక్కు ముందు వేస్తేనే తమకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటున్నారు.

రెండేళ్లుగా ఒకేసారి అన్ని జిల్లాలకు మొదటి తారీఖున జీతాలు రావటం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు కలగా మారిందనే చెప్పాలి. 2020 మార్చి నుండి లేట్‌గా అందుతున్నాయని టీచర్లు చెబుతున్నారు. మొదటి వారంలో కొన్ని జిల్లాల్లోని టీచర్లకు, మరికొన్ని జిల్లాల టీచర్లు రెండో వారంలో విడుదల చేస్తున్నారు. ఇక కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పరిస్థితి సరేసరి. రెండు మూడు నెలల తర్వాతగానీ రావు. ఈక్రమంలో ఒకటో తారీఖు కోసం జీతాల కోసం బడి పంతుళ్లు ఎదురు చూస్తున్నారు.

రెండేళ్లుగా ఒకటో తారీఖున అందని వేతనాలు…

- Advertisement -

నెల మొదటి తేదీన గడిచిన నెల వేతనం పొందటం ఉద్యోగుల హక్కు అని టీచర్‌ సంఘాల నేతలు చెప్తున్నారు. గత రెండేళ్లుగా నెల మొదటి పనిదినం నుండి పదో తేదీ మధ్య రొటేషన్‌ పద్ధతిలో రోజూ కొన్ని జిల్లాల చొప్పున వేతనాలు జమ చేసేవారు. గత మూడు నాలుగు నెలలుగా మాత్రం 12, 15 తేదీల వరకు తమ బ్యాంకు ఖాతాల్లో జీతం ఎప్పుడు జమ అవుతాయో తెలియని ఆయోమయం నెలకొందని టీఆర్‌టీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కె.రమేష్‌ పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇంటి నిర్మాణం కోసమో, పిల్లల చదువుల కోసమో, ఇతరత్ర అవసరాల కోసం తీసుకున్న బ్యాంకు రుణాల ఈఎంఐలు ప్రతి నెల 5, 10 తేదీల్లోగా చెల్లాంచాల్సి ఉంటుంది.

గడువు లోపు ఈఎంఐలు కట్టడానికి ఖాతాల్లో డబ్బులేక ఫెనాల్టితో కట్టాల్సి వస్తున్నదని టీచర్లు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉద్యోగులు కూడా భాగమే కనుక ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వ నిర్వహణా ఖర్చుల్లో భాగంగానే చూడాలని అంటున్నారు. ఉచితాలకు, అప్పుల వడ్డీలు కట్టేందుకు నిధులు పోగా ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం వద్ద బడ్జెట్‌ ఉండటంలేదని, దాంతో ఎలాగోలా ఉద్యోగులకు సద్దుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement