Tuesday, November 26, 2024

టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ కుంభకోణం.. బెంగాల్‌ మంత్రి పార్థా చ‌ట‌ర్జీ అరెస్టు

పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థ చటర్జీ ఆరెస్టయ్యారు. ఆ తర్వాత కొద్దిగంటలకే ఆయన సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధికారులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో జరిగిన టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ కుంభకోణంలో మనీలాండరింగ్‌ ఆరోపణల నేపథ్యంలో ఈ అరెస్టులు జరిగాయి. అర్పిత ముఖర్జీ ఇంట్లో ఇరవై కోట్ల రూపాయల కరెన్సీ దొరికిన కొద్దిసేపట్లోనే ఆమెను అరెస్టు చేశారు. మంత్రిని రెండు రోజుల ఈడీ కస్టడీకి ఇచ్చారు. ఈ కుంభకోణం జరిగినప్పుడు మంత్రి పార్థచటర్జీ విద్యాశాఖను నిర్వహించారు. అరెస్టు సమయానికి ఆయన పరిశ్రమలు, వాణిజ్యశాఖ నిర్వహిస్తున్నారు. ఆయన్ని గత రాత్రంతా ఇంటరాగేషన్‌ చేశారు. ఆ సమయంలో ఆయన తనకు అస్వస్థðతగా ఉందని ఇన్వెస్టిగేటింగ్‌ ఏజెన్సీ అధికారులకు చెప్పగా ఇద్దరు వైద్యులు పరీక్షలు జరిపి అనారోగ్యం ఏమీ లేదని నిర్ధారించారు. దాంతో విచారణ కొనసాగింది. మంత్రి పార్థ చటర్జీని కోల్‌కతాలోని స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

అయితే పార్థ చటర్జీ చాతీనొప్పి అని చెప్పడంతో ఆస్పత్రిలో చేర్చేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దర్యాప్తు సంస్ధ ఒక ఎమ్మెల్యేని అరెస్టు చేయాలనుకున్నప్పుడు ముందుగా తనకు తెలియజేయాల్సి ఉంటుందని పశ్చిమబెంగాల్‌ అసెంబ్లి స్పీకర్‌ బిమన్‌ బెనర్జీ అన్నారు. తాజా పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, సరైన తరుణంలో స్పందిస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ అన్నారు. పార్థ చటర్జీ మరో సన్నిహితురాలు మోనాలిసా దాస్‌ మీద కూడా ఈడీ నిఘా పెట్టింది. మోనాలిసా దాస్‌ రాష్ట్రంలోని అసన్‌సోల్‌లో ఉన్న కాజీ నజ్రూల్‌ యూనివర్సిటీలో బంగ్లా ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఎస్‌ఎస్‌సీ కుంభకోణంలో ఆమె పాత్ర గురించి ఈడీ ఆరా తీస్తున్నదని, ఆమె పేరిట పది ఫ్లాట్లు రిజిస్టర్‌ అయి ఉన్నాయని, ఆమెకు బంగ్లాదేశ్‌తో లింకులున్నాయని బీజేపీ నాయకుడు దిలీప్‌ ఘోష్‌ చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement