తెలంగాణ టీడీపీకి గట్టి షాక్ తగిలింది. టీఆర్ఎస్ లో టీడీపీ విలీనం అయ్యింది. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు చెందిన టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్‌లో తెలంగాణ టీడీపీ శాసనాసభా పక్షాన్ని విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు ప్రకటించారు. తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు తెలిపారు. శాసనసభా వ్యవహరాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో మెచ్చా భేటీ అయ్యారు. అనంతరం మరో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి లేఖ అందించారు. టీడీపీ శాసనాసభా పక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు స్పీకర్‌కి లేఖ ఇచ్చారు.ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు సీఎం కేసీఆర్ తో పలుసార్లు మాట్లాడారు. తాజాగా టీఆర్ఎస్ లో చేరారు.
కాగా, 2018లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున కేవలం ఇద్దరు మాత్రమే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి మెచ్చా నాగేశ్వర్ రావు, సత్తుపల్లి నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. అయితే, తరువాత కొంతకాలానికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే తనకు టీడీపీని వీడే ఉద్దేశం లేదని మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
కాగా, టీడీపీ నుంచి గెలుపొందిన మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో చేరతారంటూ ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. అయితే, గతంలో ఈ ప్రచారాన్ని ఆయన కొట్టిపారేస్తున్నారు. తనకు టీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు వచ్చిన మాట నిజమే గానీ, టీడీపీని వీడే ఆలోచనల లేదన్నారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన టీడీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడనని, చంద్రబాబు సారథ్యంలో ప్రజలకు సేవలు చేస్తానని తెలిపారు. తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పినా టీడీపీని వదిలి వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. తనను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని వ్యాఖ్యానించారు. నిరంతరం ప్రజల కోసమే పని చేస్తానని, పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికార పార్టీలోకి చేరకపోతే నిధులు రావని, అభివృద్ధి కుంటుపడుతుందనేది అవాస్తవమని పేర్కొన్నారు. అందరి ఎమ్మెల్యేలను సమానంగా చూస్తారని భావిస్తున్నానమని, కేసీఆర్ మీద తనకు నమ్మకుముందని మెచ్చా గతంలో అన్నారు. అయితే, గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ది కోసమే మెచ్చా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది.