Saturday, November 23, 2024

పచ్చతోరణం కాదు.. అది అవినీతికి తోరణం: అచ్చెన్నాయుడు

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ పాలనలో ఓ వైపు పర్యావరణం, అటవీ చట్టాల నిభంధనలను ఉల్లఘించి అక్రమ మైనింగ్ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న వేలాది చెట్లను నరుకుతూ… మరోవైపు పర్యావరణ పరిరక్షణ అంటూ మెక్కలు నాటడం పేరుతో ప్రభుత్వ నిధులను వైసీపీ నేతలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. జగనన్న పచ్చతోరణం పేరుతో వైసీపీ నేతల అవినీతికి జగన్ రెడ్డి తోరణం పరిచారని ఆరోపించారు.

ఉపాధి హామీ పథకం నిధులతో ‘జగనన్న పచ్చతోరణం’ పథకాన్ని అమలు చేస్తూ ఒక్కో మొక్కకు ఏడాదికి రూ.385 ఖర్చు చేస్తున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మెక్కల నిర్వహణ బాధ్యత వైసీపీ కార్యకర్తలకు అప్పగించి కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఈ రెండేళ్లలో ఎన్ని మెక్కలు నాటారు? వాటిలో ఎన్ని మెక్కలు బ్రతికాయో ప్రజలకు లెక్కలు చెప్పాలి? మొక్కలు నాటుతున్నారా? లేక మొక్కల పేరుతో డబ్బులు తింటున్నారా? అంటూ నిలదీశారు. ఆక్సిజన్ అందించే మొక్కల పెంపకంలోనూ అవినీతికి పాల్పడటం వైసీపీ నేతలకే చెల్లిందన్నారు.

వైసీపీ నేతలు రాష్ట్రంలో పకృతి సంపదను అక్రమ మైనింగ్ కోసం ధ్వంసం చేసి కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. ఏపీకి కళారంగంలో ఖండాంతర ఖ్యాతిని తెచ్చిపెట్టిన కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగపడే వందలాది తెల్ల పోనంకి చెట్లను అక్రమ మైనింగ్ కోసం నరికేశారని మండిపడ్డారు. కాకినాడకు తుపాన్‌ల నుంచి రక్షణగా ఉన్న మడ అడవులను నరికేశారన్నారు. ఈ ప్రాంతంలో 112 ఎకరాల్లో 30 శాతం మేర అడవులు నరికివేశారని ఎన్జీటీ సైతం స్పష్టం చేసినట్లు గుర్తుచేశారు. విశాఖ ఏజెన్సీ ఏరియాల్లో అక్రమ మైనింగ్‌ను తరలించేందుకు వైసీపీ నేతలు 14 కిలో మీటర్ల మేర వేలాది చెట్లు నరికి అక్రమంగా రోడ్డు వేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాయలసీమలో టీడీపీ సానుభూతి పరులకు చెందిన వందలాది ఎకరాల్లో మామిడి, చినీ వంటి చెట్లను నరికివేశారన్నారు. వైసీపీ నేతలు ఓ వైపు అక్రమ సంపాదన కోసం చెట్లు, అడవులు నరుకుతుంటే.. మరోవైపు సీఎం మెక్కలు నాటడం పేరుతో ప్రభుత్వ నిధుల్ని వైసీపీ నేతలకు దోచిపెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం నాటిన మొక్కల్నిసంరక్షిస్తూ రాష్ట్రంలో పర్యావరణాన్ని కాపాడేందుకు, పచ్చదనాన్ని పెంపొందించేందుకు చిత్తశుద్దితో చర్యలు తీసుకోవాలని హితవు పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement