Monday, November 18, 2024

మార్చి రెండవ వారంలో టీడీపీ బహిరంగ సభ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మార్చి రెండవవారంలోగా నియోజకవర్గాల కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని టీడీపీ అదిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ముఖ్యనాయకులు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా నియోజకవర్గాల నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే ఆలోగా కరపత్రాల ప్రచారం, సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించింది. నియోజకవర్గాల కార్యవర్గం నాయకత్వాన్ని పటిష్టం చేసిన అనంతరం మార్చి రెండవ వారంలో నిజామాబాద్‌ బహిరంగ సభ నిర్వహించి చంద్రబాబునాయుడును ఆహ్వానించాలని టీటీడీపీ నాయకత్వం నిర్ణయించింది. సుమారు 20 లక్షల సభ్యత్వం నమోదు చేయాలని నియోజకవర్గాల వారిగా సభ్యత్వం పుస్తకాలను పంపిణీ చేశారు.

అయితే ఇప్పటివరకు ఏనియోజకవర్గంలో సభ్యత్వం నమోదుకాకపోవడంతో పార్టీ అధిష్టానం ఆందోళన చెందుతుంది. ఖమ్మం బహిరంగ సభ విజయవంతం కావడంతో దక్షిణ తెలంగాణలో టీటీడీపీ ప్రచారంలో కొంత స్పీడ్‌ పెరిగింది. అయితే నిజమాబాద్‌ సభ అంతకు మించి నిర్వహించని పక్షంలో ప్రజల్లో చులకనయ్యే ప్రమాదం ఉందని టీటీడీపీ ఆందోళన చెందుతుంది. ఈ మేరకు టీటీడీపీ నాయకత్వం ఇప్పటికే నియోజకవర్గాలకు పార్టీ పరిశీలకులను పంపించి నివేదికలు తెప్పించుకుంటుంది. అయితే నియోజకవర్గాల్లో పార్టీ ఇప్పటికే పూర్తిగా పతనావస్తలో ఉందనీ నివేదికలు స్పష్టం చేయడంతో పార్టీ బలోపేతంచేసే చర్యలపై దృష్టి సారించింది.ఒకప్పుడు టీటీడీపీకి కంచుకోటగా ఉన్న తెలంగాణలో ఆకోటలకు బీటలు బారడంతో పునర్‌ వైభవానికి నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందనీ, వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తిగడలుండాలని పార్టీ నాయకత్వం భావిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement