వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ యువనేత, అనంతపురం పార్లమెంట్ టీడీపీ ఇంఛార్జి జేసీ పవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై జగన్ సర్కారు అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపించారు. జేసీ కుటుంబాన్ని జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తన తమ్ముడు జేసీ అస్మిత్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉంటున్నాడని చెప్పుకొచ్చారు.
మరోవైపు రాష్ట్రంలో ఏం జరిగినా సీఎం జగన్ ఇంటి నుంచి బయటకు రారని జేసీ పవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈనెల 19న సీఎం జగన్ ఇంటి తలుపు కొట్టి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. దేనికి పనికిరాని ఓ వ్యక్తి చేతిలో తన తమ్ముడు జేసీ అస్మిత్ రెడ్డి ఓడిపోవడం కొంచెం బాధగా ఉందన్నారు. వైసీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ ప్రజలకు గాలి ఇవ్వడం సంగతి పక్కనపెడితే.. ఆ ఫ్యాన్‌కు నిరుద్యోగ యువతీ యువకులు ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోతున్నారని జేసీ పవన్ రెడ్డి ఆరోపించారు. కియా పరిశ్రమలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వ ఉత్తర్వులు ఏం అయ్యాయని ఆయన ప్రశ్నించారు.
ఈ వార్త కూడా చదవండి: రాష్టంలో అన్నీ గోతులే.. ఎంపీ రఘురామ సెటైర్లు