టీటీడీ విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు మండిపడ్డారు. ధర్మాన్ని రక్షిస్తే అది మిమ్మల్ని రక్షిస్తుందన్న విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. చట్టంలో లేకపోయినా 50 మంది సలహాదారులను పెట్టారన్నారు.
జగన్‌కు 151 మంది ఎమ్మెల్యేలున్నారనే అహం ఉందని అశోక్‌బాబు ఆరోపించారు. టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టు సీరియస్ అయిందన్నారు. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జారీ చేసిన జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసిందన్నారు. బోర్డు మెంబర్లు కూడా ప్రత్యేక పత్రాలు ఇవ్వడంతో సామాన్యులకు దర్శనం గగనమైందని చెప్పారు. లడ్డూలు, టికెట్ల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారని ఆయన పేర్కొన్నారు.