న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ యువ నేత అడారి కిషోర్ కుమార్ ఆరోపించారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో అంబేద్కర్ విగ్రహం ఎదుట మరికొందరు పార్టీ కార్యకర్తలతో కలిసి మోకాళ్లపై నిరసన ప్రదర్శన చేపట్టారు. భారత రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, జనం రోడ్డు మీదకు వస్తే చాలు అరెస్టు చేసి జీపులు ఎక్కిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ ఆంక్షలు విధించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క వీధిలో ప్రతిపక్షాలు బహిరంగంగా తిరిగే పరిస్థితి లేదన్నారు. కనీసం తమ అభిప్రాయాన్ని బయటకు చెప్పుకోకుండా పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితిపై భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోమంత్రితో పాటు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశానని కిశోర్ చెప్పారు. ఈ నిరసన ప్రదర్శనలో కిశోర్‌తో పాటు దళిత జేఏసీ నేత ఆలూరి రాజేష్, ఢిల్లీ తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.