ఏపీ సీఎం జగన్ తిరుపతి పర్యటన రద్దుపై ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. మొన్నటి వరకు కరోనా లేదు, గిరోనా లేదు ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన జగన్.. నేడు అదే కరోనా పేరు చెప్పి తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఇది పిరికితనం కాక మరేంటని ప్రశ్నించారు. జగన్ విచిత్రమైన వ్యక్తి అని, ఆయన రివర్స్‌లో పనిచేస్తారని విమర్శించారు. బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎక్కడ ప్రమాణం చేయాల్సి వస్తుందోనన్న భయంతోనే జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారని అన్నారు. ఆయన హత్య కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ప్రమాణం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అచ్చెన్నాయుడు అన్నారు.
అటు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కూడా జగన్‌పై విమర్శలు చేశారు. ‘మీ తిరుపతి ఎన్నికల సభ ఎందుకు వాయిదా వేశారు ముఖ్యమంత్రి గారూ, కరోనా భయంతోనేనా? మరి మిగతా నాయకుల సభలకు జనం తండోప తండాలుగా వస్తున్నారు. అదే నిజమైతే, ఎన్నికలు వాయిదా వెయ్యాలిగా? అసలు మీ భయం, కరోనా గురించా, లేక బాబాయిని చంపిందెవరని జనం నిలదీస్తారనా? తెగేదాక లాక్కండి సార్, పబ్లిక్ సార్’ అని వర్ల రామయ్య విమర్శలు సంధించారు.