బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు చెందిన ఈడీ అటాచ్ చేసిన మొత్తం రూ.9,371 కోట్ల విలువైన ఆస్తులను రుణాలు ఇచ్చిన బ్యాంకులకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ జప్తు చేసిన సీఎం జగన్ అక్రమాస్తులను ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.
మాల్యా, నీరప్ మోదీ, చోక్సీ ఆస్తులను కూడా బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వపరం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. బ్యాంకులకు మోసం చేసిన సొమ్మును తిరిగి బ్యాంకుల పరం చేసినట్లే, ప్రజలను మోసం చేసిన సొమ్మును ప్రజల పరం చేయాలన్నారు. సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొన్న జగన్ రూ.43 వేల కోట్ల అక్రమార్జనను ప్రజాపరం చేయాలని యనమల అన్నారు. జగన్ పాల్పడ్డ ఆర్థిక నేరాలకు ఆయన అఫిడవిటే అద్దం పట్టిందని 47 పేజీల అఫిడవిట్‌లో 18 పేజీలు ఆర్థిక నేరాల చిట్టానే ఉందని తెలిపారు. డొల్ల కంపెనీలు పెట్టి నిధుల సమీకరణతో పాటు నగదు అక్రమ చలామణీ నేరాల్లో విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలతో జగన్ పోటీ పడుతున్నారని యనమల అన్నారు. భారత్‌లోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణం జగన్ క్విడ్ ప్రొక్వో అవినీతి అని యనమల ఆరోపించారు. అంతర్జాతీయ వర్సిటీల్లో పాఠ్యాంశాలుగా జగన్ ఆర్థిక నేరాల చిట్టాలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్థిక నేరం హత్య కంటే ప్రమాదకరమని గతంలో సుప్రీంకోర్టు హెచ్చరించిందని చెప్పారు.