ఏపీ సీఎం జగన్ తల్లి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై టీడీపీ నేత పట్టాభి తీవ్ర విమర్శలు చేశారు. విజయమ్మ ఈ నాటి గాంధారి అని అభివర్ణించారు. విజయమ్మ కళ్లకు గంతలు తీసేసి మాట్లాడాలని అన్నారు. వైఎస్ వివేకా కుమార్తె సునీత పిటిషన్ లో పేర్కొన్నట్టు… సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు తీసుకున్న చర్యలు విజయమ్మకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు దోషులను కాపాడేందుకు జగన్ పదేపదే సిట్ ను మార్చాలని ప్రయత్నించిన విషయాన్ని సునీత లేవనెత్తారని… ఆ విషయం విజయమ్మకు తెలియదా? అని పట్టాభి నిలదీశారు.
జగన్ సీఎం అయిన తర్వాత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని కేసును వెనక్కి తీసుకున్న విషయం విజయమ్మకు తెలియదా? అని ప్రశ్నించారు. సిట్ అధికారి అభిషేక్ మహంతి ఎందుకు లాంగ్ లీవ్ లో వెళ్లారో చెప్పాలన్నారు. మూడు సార్లు సిట్ అధికారులను ఎందుకు మార్చారని నిలదీశారు. కోడికత్తి డ్రామాలో పాత్రధారులైన ఇద్దరు తెలంగాణ వైద్యులకు ఏపీలో కీలక పదవులను ఎందుకిచ్చారని ప్రశ్నించారు. సొంత చెల్లెలికే వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్ దే అని పట్టాభి విమర్శించారు.