ఆంధ్రప్రదేశ్ లో మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ మోహన్‌రెడ్డి… ఆ మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని టీడీపీ నేత, మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది ? అని ప్రశ్నించారు. మనుషుల బలహీనతను ముఖ్యమంత్రి ఆదాయ వనరుగా మార్చుకున్నారని మండిపడ్డారు. బ్రాండెడ్ కంపెనీలను మూసివేయించి సొంత బ్రాండ్లను అమ్ముతున్నారని ఆరోపించారు. దశలవారీ మద్యపాన నిషేధమన్న జగన్ మాట తప్పి మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. నాటుసారా తయారీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. మద్యం ఆదాయంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని జవహర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకూ రెండు సూట్ కేసుల విధానం నడుస్తోందని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. ఒక సూట్ కేసు ధనం నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తుంటే… మరొకటి ప్రభుత్వ ఖజానాకు జమవుతోందని ధ్వజమెత్తారు. భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టడం ఒక్క జగన్‌కే సాధ్యమైందని విమర్శించారు. ధరలు పెంచితే వినియోగం తగ్గుతుందనే తప్పుడు ప్రచారంతో… ప్రజల సొమ్మును తన ఖాతాలోకి జమేసుకుంటున్నారని జవహర్ ఆరోపించారు.