టీడీపీ ప్రభుత్వంలో రూ. 64 వేల కోట్ల నిధులను ఇరిగేషన్ పనులకు ఖర్చు పెట్టామన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. 71 శాతం పోలవరం డ్యామ్ పనులను పూర్తి చేసామని, చంద్రబాబు హయాంలో 64 ప్రాజెక్టులను చేపట్టామన్నారు. పోలవరం ప్రాజెక్టులో తాము నిర్మించిన వాల్స్ ఎత్తు పెంచి, మేం చేయించిన గేట్లు పెట్టి, పనులు చేశామంటూ వైసీపీ గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. వంశధార, నాగావళి ప్రాజెక్టుల పనులు ఏమయ్యాయని ప్రశ్నించారు.
రాజ్యసభ, పార్లమెంట్‌లో 28 మంది ఎంపీలు గడ్డి పీకుతున్నారా? అని నిలదీశారు. డీపీఆర్ 2కి సంబంధించి ఆమోదం సాధించలేని అసమర్థ సీఎం, మంత్రి ఉన్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల కాలంలో నెల్లూరు జిల్లాలో సంగం, నెల్లూరు బ్యారేజి పనులు ఎంత వరకు వచ్చాయని ప్రశ్నించారు. ఎన్టీఆర్, చంద్రబాబు పుణ్యాన సోమశిల, తెలుగుగంగలో నీరు నిలిపామని తెలిపారు. పార్టీ ఎంపీలకు, వైసీపీ నేతలకు పనులు కట్టబెట్టేందుకే రివర్స్ టెండరింగ్ డ్రామా అని విమర్శించారు. పథకం ప్రకారం చంద్రబాబు ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తే.. వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు.