Friday, November 22, 2024

అమ్మ ఒడి పథకాన్ని ఎందుకు వాయిదా వేశారు?: అచ్చెన్నాయుడు

ఏపీలో అమ్మఒడి పథకం అమలు విషయంలో జగన్ తొలినుంచీ మోసపూరిత వైఖరిని అవలంభిస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బడికి వెళ్లే ప్రతి పిల్లవాడికి అమ్మఒడిని అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పుడు మాటమార్చి పిల్లల తల్లికి మాత్రమే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. మొత్తం 84 లక్షల మంది విద్యార్థులుంటే ఇప్పుడు 44 లక్షల మందికే పథకాన్ని అమలు చేస్తూ, ఇంచుమించు సగం మందిని మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇందులోనూ బోల్డన్ని మార్పులు చేశారని విమర్శించారు. తొలుత రూ. 15 వేలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత 14 వేలు అన్నారని, ఇప్పుడు డబ్బులకు బదులు ల్యాప్‌టాప్‌లు ఇస్తామంటున్నారని విమర్శించారు. పథకాల పేరుతో ప్రజలను ఊరించి మోసగించడం జగన్‌కు మాత్రమే సాధ్యమని అన్నారు. హాజరు పేరుతో ఇప్పుడు మొత్తం పథకానికే ఎగనామం పెట్టాలనుకుంటున్నారని ఆరోపించారు. ఈ పథకాన్ని జూన్‌కు వాయిదా వేయడం అందులో భాగమేనని అన్నారు. కరోనా కారణంగా పాఠశాలలు తెరుచుకోకపోయినా పథకాన్ని అమలు చేస్తామని గతంలో గొప్పలు చెప్పారని, ఇప్పుడు 75 శాతం హాజరు చూపించి పథకం అమలును వాయిదా వేయడం దారుణమని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement