అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎన్నికల హడావుడి అప్పుడే మొదలైంది. ఎన్నికలకు ఇంకా దాదాపు ఎనిమిది నెలలకు పైగా గడువు ఉన్నప్పటికీ రాజకీయ పక్షాలు ఇప్పటి నుంచే తమ వ్యూహా లను అమలు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో బలమైన వ్యూహాలను రచించిస్తోంది. కొంత కాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు క్షేత్రస్ధాయిలో వరుస పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఆ స్పీడును మరింత పెంచి టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు. మహానాడులో మినీమ్యానిఫెస్టోను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ తమ సంక్షేమ అజెండాను ప్రజలకు చేర్చే పనిలో నిమగ్నమయ్యింది.
ముఖ్యంగా మ్యానిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్ధాయిలోకి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇంకో వైపు యువ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ద్వారా పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న సంకల్పంతో అడుగులు వేస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను పాదయాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తూనే అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తూ సెల్ఫీ చాలెంజ్ లు విసురుతున్నారు. ఇక పార్టీ అధినేత చంద్రబాబు దాదాపు రెండేళ్ళ కాలంగా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు తన పర్యటనల జోరును మరింత పెంచారు.
నెలకు రెండు నుంచి మూడు జిల్లాల్లో పర్యటిస్తూ వస్తున్నారు. ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తూ దాదాపు నాలుగు నుంచి ఐదు నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ రోడ్డు షోలు , బహిరంగ సభల ద్వారా జనంకు చేరువవుతున్నారు. ప్రస్తుతం కుప్పంలో పర్యటిస్తున్న ఆయన మినీమ్యానిఫెస్టో ప్రచారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లు, ముఖ్య నేతలు భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమాలను నిర్వహిస్తూ జనం మధ్యే ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని మరింత బలంగా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 19 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 125 నియోజకవర్గాల్లో ఐదు బస్సుల ద్వారా భవిష్యత్‌కు గ్యారెంటీ పై ప్రచార కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఒక వైపు జిల్లాల పర్యటనలు చేస్తూనే మరొకవైపు అభ్యర్దుల ఎంపిక, పొత్తుల అంశంపై చంద్రబాబు దృష్టి సారించారు.
కొలిక్కి వస్తున్న పొత్తులు
రానున్న ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో కలిసి బరిలోకి దిగేందుకు టీడీపీ సిద్దమౌతోంది. ఈ మూడు పార్టీల పొత్తు దాదాపు ఒక కొలిక్కి వచ్చినట్లుగా స్పష్టమౌతోంది. ఇప్పటికే జనసేన తో టీడీపీ పొత్తు దాదాపుగా ఖరారైయింది. ఇక బీజేపీ తో కూడా చర్చలు జరుగుతున్నాయి. సీట్ల సర్ధు బాటు పై ఉన్నతస్ధాయిలో చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఈ నెలాఖరుకల్లా పొత్తుల అంశాన్ని ఫైనల్ చేయాలన్న యోచనలో టీడీపీ అధి నేత ఉన్నట్లు గా తెలుస్తోంది. పొత్తులపై పూర్తి స్దాయిలో క్లారిటీ వచ్చాక పర్యటనల జోరును మరింత పెంచి ఇక పూర్తి స్దాయిలో ప్రజా క్షేత్రంలో ఉండాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు.