టిడిపి అధినేత చంద్రబాబునాయుడిని కలిశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. తాను చంద్రబాబుని ఎందుకు కలిశానో వివరించారు మోహన్ బాబు. తన విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులకు ఫీజు రీఎయింబర్స్ మెంట్ చెల్లించలేదని.. గత ఎన్నికలకు ముందు తిరుపతిలో మోహన్ బాబు ఆందోళన నిర్వహించారు. రాస్తారోకో, ధర్నా చేపట్టారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు, మోహన్ బాబు మధ్య గ్యాప్ పెరిగింది. చాల రోజుల తర్వాత తాజాగా చంద్రబాబుతో మోహన్ బాబు భేటీ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు చంద్రబాబుని కలవటం వెనక ఆధ్యాత్మిక కారణం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. తిరుపతి సమీపంలోని చంద్రగిరి పరిసరాల్లో తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ఆవరణలో సాయిబాబా ఆలయం నిర్మించారు మోహన్ బాబు. ఈ ఆలయ నిర్మాణం పూర్తికావడంతో చంద్రబాబును ప్రత్యేకంగా ఆహ్వానించేందుకే ఆయన నివాసానికి వెళ్లారట మంచు మోహన్ బాబు. ఏదేమైనా ఈ భేటీ మాత్రం ఏపీ రాజకీయాల్లో ఓ కీలక పరిణామం అయింది. ఈ మేరకు ఓ ఇన్విటేషన్ కార్డ్ ని ఆయన చంద్రబాబుకి ఇచ్చారు.